అనుకున్నది ఒకటి అయ్యిందొకటి అన్నట్లుగా తయారైంది వ్యవహారం. గతంలో చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గురువారం నుండి కార్యకర్తలతో సమావేశాలు మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో తాను సమావేశమవుతానని జగన్ గతంలో చెప్పిన విషయం గుర్తుండేవుంటుంది. చెప్పినట్లుగానే కుప్పం నియోజకవర్గం నుండే తన భేటీని మొదలుపెట్టారు. సరే భేటీలో కుప్పంను గెలవాలన్నారు.
సర్పంచ్ నుండి మున్సిపాలిటీ వరకు అన్నీ గెలిచిన వైసీపీ ఎంఎల్ఏగా మాత్రం ఎందుకు గెలవదని ప్రశ్నించారు. కార్యకర్తలంతా మద్దతుగా నిలిస్తే ఎంఎల్సీ భరత్ ఎంఎల్ఏగా గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. భరత్ ఎంఎల్ఏగా గెలిస్తే మంత్రిని చేస్తానని జగన్ బంపరాఫర్ ఇచ్చారు. భరత్ ను మంత్రిని చెస్తానన్న హామీ తప్ప మిగిలిందంతా కొంతకాలంగా జగన్ పదే పదే చెబుతున్నదే. అయితే సమావేశాల సందర్భంగా చాలామంది అనుకున్నదివేరు జరిగింది వేరు.
కార్యకర్తల సమావేశం అంటే నియోజకవర్గాల్లో పార్టీ, ప్రభుత్వంపై జనాల అభిప్రాయాలు ఏమిటి ? ప్రభుత్వం ఇమేజి జనాల్లో ఎలాగుంది అనే విషయాలు తెలుసుకుంటారని అనుకున్నారు. పార్టీ, ప్రభుత్వం పరంగా ఉన్న లోటుపాట్లను కార్యకర్తల ద్వారా జగన్ తెలుసుకుంటారని చాలామంది ఊహించారు. కార్యకర్తలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా దిద్దుబాటు చర్యలకు జగన్ శ్రీకారం చుడతారని నేతలు అంచనాలు వేశారు. అయితే భేటీ జరిగిన తీరుచూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు.
మొదటి నుండి ఎంఎల్ఏలు, నేతల సమావేశాల్లో చెప్పినట్లుగానే జగన్ ఇపుడు కూడా చెప్పారు. అంటే వన్ సైడ్ బ్యాటింగ్ అన్నట్లుగా సమావేశం జరిగింది. పార్టీలో ప్రభుత్వంలోని లోటుపాట్లను తెలుసుకునేందుకే జగన్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించబోతున్నారని అనుకున్నవారు తీవ్ర నిరాశ లోకి వెళ్ళిపోయారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించడమే టార్గెట్ గా జగన్ పావులుకదుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పటం వల్ల ఉపయోగం ఏమిటో అర్ధం కావటం లేదు. గ్రౌండ్ లెవల్లో పార్టీ పరిస్ధితి ఎలాగుందో కార్యకర్తల ద్వారా తెలుసుకుంటేనే అవసరమైనచోట్ల రిపేర్ చేయచ్చు. లేకపోతే ఇలాంటి సమావేశాలు దండగనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates