తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. పార్టీలో ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రగడ చల్లారకపోయినా.. ఆయన మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. పార్టీనిబలోపేతం చేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పొరుగు పార్టీనాయకులను కూడా రేవంత్ ఆకర్షిస్తున్నా రు. దీంతో రాష్ట్రంలో పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెరుకు సుధాకర్‌తో పాటు ఆ పార్టీ నాయకులు బత్తుల సోమయ్య, సందీప్ చమార్, కాంగ్రెస్ నాయకుడు సత్తు మల్లేష్ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. పార్టీని అధికారంలోకి తెచ్చేదిశగా తాము చర్యలు చేపడుతున్నామ న్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రతి ఒక్కరూ అభిమానంతో ఉన్నారని తెలిపారు. పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని.. నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని.. ప్రతి ఒక్కరి కృషితోనే పార్టీ అధికారంలోకి వస్తుందని.. రేవంత్ వ్యాఖ్యానించారు.
మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా కాంగ్రెస్‌దేనని అన్నారు. మరింత మంది నాయకులు.. పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒకరిద్దరు పోయినంత మాత్రాన కాంగ్రెస్ ఎప్పటికీ బలహీనం కాదని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.