రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారో అనేది ఆసక్తికర విషయమే. అవకాశం.. అవసరం .. అనే రెండు పట్టాలపైనే రాజకీయాలు ముందుకు సాగుతాయి. కేంద్రంతోతాను సఖ్యతగా ఉంటే.. ఏపీకి అన్నీ సమకూరుతాయనేది సీఎం జగన్ ఆలోచన. ఎందుకంటే.. ఏపీ అనేక ఇబ్బందులలో ఉందని.. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. కేంద్రం నుంచి సాయం లేకపోతే.. రాష్ట్ర ముందుకు సాగదని.. జగన్ నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రాన్ని మచ్చిక చేసుకుని ముందుకు సాగుతున్నారు.
ఇక, కేంద్రం కూడా.. ఏపీలోని అధికార పార్టీకి ఎంపీల బలం ఉన్ననేపథ్యంలో అనుకూలంగానే ఉంది. ఇప్పటి వరకు జరిగిన అనేక విషయాల్లో వైసీపీ సాయం కూడా తీసుకుంది. వ్యవసాయ చట్టాలు.. 370 ఆర్టిక ల్ రద్దు.. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలు.. వంటి విషయాల్లో వైసీపీ మద్దతు బీజేపీ తీసుకుంది. దీంతో వైసీపీకి అన్నివిధాలా కేంద్రం సహకరిస్తుందని.. జగన్ భావిస్తూ.. వస్తున్నారు. కానీ, అన్ని విషయాల్లోనూ.. మోడీ సర్కారు సహకరించదనే సంచలన విషయం.. తాజాగా వెలుగు చూసింది.
ఎందుకంటే.. దేశభద్రతకు సంబంధించినవిషయాల్లో తాను ఎక్కడ ఇరుక్కుంటానని భావిస్తున్న మోడీ సర్కారు.. కొన్నికొన్ని విషయాల్లో తాను తప్పించేసుకుని.. జగన్ సర్కారును ఇరికించేస్తోందనే టాక్ వినిపి స్తోంది. తాజాగా పార్లమెంటు సాక్షిగా జరిగిన ఘటన దీనినే రుజువు చేసింది. బీచ్ సాండ్(తీర ప్రాంతాల్లో లభించే ఇసుక) మైనింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరింది.
అయితే.. దీనికి కేంద్రం నో అని చెప్పింది. ఈ విషయమే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది. పోనీ ఏపీ సర్కార్ ప్రతిపాదనను పక్కన పెడితే పెట్టవచ్చు కానీ కొన్ని కీలక కామెంట్స్ కూడా చేయడం ఇప్పుడు చర్చకు వస్తోంది. బీచ్ సాండ్ నుంచి అణు ఇంధనానికి అవసరమైన మోనోటైజ్ ని పక్కకు తప్పిస్తున్నారనేది.. దీనిని అక్రమంగా విదేశాలకు పంపిస్తున్నారనేది కేంద్రం ఆరోపణ.
దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సర్కారును కేంద్రం వివరణ కోరింది. అయితే.. ఈ వివరణకు కేంద్రం సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలోనే తామే స్వయంగా రంగంలోకి దిగి.. ఇప్పటి వరకు ఎంత తవ్వకం జరిగిందనే విషయంపై నిజాలు నిగ్గుతేలుస్తామని.. పేర్కొంది. ఈ ఫిర్యాదుల మీద అణు ఇంధన శాఖ సూచనలతో దర్యాప్తు చేపట్టాలని బ్యూరో ఆఫ్ మైన్స్ కి ఆదేశాలను ఇచ్చినట్లు కేంద్ర మంత్రి చెబుతున్నారు.
ఈ అంశాలన్నీ కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. మొత్తానికి చూస్తే ఏపీ సర్కార్ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చడమే కాకుండా.. ఇక్కడ జరిగిన తవ్వకాలు.. ఎగుమతులపై కూడా నిఘా పెట్టడం.. దర్యాప్తు చేపట్టడం వంటివి చూస్తే.. “తమ్ముడు తమ్ముడే“ అన్న సామెతను మోడీ గుర్తు చేస్టున్నట్టుగా ఉందని అంటున్నారు. ఏదేమైనా.. జగన్ తీసుకునే నిర్ణయాలకు.. మోడీ గుడ్డిగా అయితే.. ఫాలో కారని చెబుతున్నారు.