అయ్యా.. మేం కష్టాల్లో ఉన్నాం.. మాకు ఆదరువు లేదు.. పింఛను ఇచ్చి పుణ్యం కట్టుకోండి..అంటూ.. చాలా మంది వృద్ధులు..అర్హులైన పేదలు.. సర్కారుకు మొర పెట్టుకుంటున్న విషయం తరచుగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తున్న గడపగడపకు కార్యక్రమంలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే.. దీనిపై ప్రభుత్వం మాత్రం చూస్తాం..చేస్తాం..అంటూకాలం గడిపేస్తోంది.
ఇదిలావుంటే.. తాజాగా.. ఓ సంచలన విషయం వెలుగు చూసింది. ఓ చనిపోయిన వ్యక్తికి మూడేళ్లుగా ఠంచనుగా పింఛను ఇస్తున్నారు. అంతేకాదు.. రైతు భరోసా కింద కూడా ఆయనకు నిధులు ఇస్తున్నారు. ఇది ఇన్నాళ్లకు వెలుగు చూసింది. అది ఎక్కడో కాదు.. వైసీపీ సర్కారు హయాంలోనే.. అది కూడా కృష్ణాజిల్లాలోనే కావడం.. ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ విషయం కూడా మంత్రి జోగి రమేష్ నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనే బయట పడడం గమనార్హం.
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడకు చెందిన రాజులపాటి సత్యనారాయణ 2013లో మృతి చెందారు. ఆయనకు గత మూడేళ్లుగా వైఎస్‌ఆర్ పింఛను కానుక కింద రూ. 33,500.. వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద రూ. 34,500 ఇచ్చినట్లు.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి జోగి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దీనికి సంబంధించిన ‘సంక్షేమ బావుటా’ పత్రాన్ని అందజేశారు.
దీనికి ఆశ్చర్యపోయిన సత్యనారాయణ కుమారుడు జగదీశ్.. మా నాన్న చచ్చిపోయి చాలా ఏళ్లు అయింది. ఆయన పేరుతో ఎలాంటి ఫించను కూడా లేదు.. ఆ సొమ్ము ఎవరు తీసుకున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్థానిక వాలంటీరును ప్రశ్నించగా అదే పేరుతో మరో వ్యక్తి ఇంకో వార్డులో ఉండి ఉంటారని తెలిపినట్లు జగదీశ్ పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో ఏవీ నాంచారరావును మంత్రి వివరణ కోరగా ఈ విషయం ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతామని తెలిపారు.
అయితే.. దీనిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఒకే పేరుతొ మరో వ్యక్తి ఉండొచ్చని.. కానీ, ఆయన వయసు , ఈయన వయసు ఎలా ఒకటే అవుతుందని అంటున్నారు. అంతేకాదు.. ఆయన వ్యవసాయం చేస్తున్నారన్న గ్యారెంటీ ఏంటని కూడా వలంటీర్‌ను నిలదీశారు. ప్రస్తుతం ఇది వలంటీర్ మెడకు చుట్టుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.