‘మీరు’ అని అంటారా? రేవంత్ సారీ చెప్పాల్సిందే!

‘మీరు’ అన్న మాటలో ఎంత తప్పు ఉందన్న విషయం కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అడిగితే ఇట్టే చెప్పేస్తారు. తాజాగా ఆయన చాలా ఆగ్రహంతో ఉన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి.. బీజేపీలో చేరేందుకు సిద్దమన్న ప్రకటన చేసిన నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లోని ‘మీరు’ పద ప్రయోగంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డి చర్యను ‘మీరు’ అన్న పదం వాడటం ద్వారా రేవంత్.. తనను కూడా రాజగోపాల్ జట్టు కట్టేశారని.. తాను అసలుసిసలు కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో తన పేరును ముడేసేలా రేవంత్ రెడ్డి వాడిన ‘మీరు’ మాటకు తనకు క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

తన సోదరుడి పార్టీ ఫిరాయింపుపై ఆయన్నే ప్రశ్నించాలని అంటున్న వెంకటరెడ్డి.. తాను కాంగ్రెస్ కార్యకర్తనని.. పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పని చేస్తానతాని చెప్పారు. తాను కూడా పార్టీ మారతానని మీడియా అనుమానపడుతుందని.. తాను రియాక్టు కావటానికి మరేమీ లేదని అన్నారు. రేవంత్ మాట్లాడే వేళలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనాలే తప్పించి కోమటిరెడ్డి బ్రదర్స్ అనే అర్థం వచ్చేలా మాట్లాడకూడదన్నారు.

34 ఏళ్లుగా పార్టీ కోసం రక్తం ధారపోస్తే ఇప్పుడు అవమానించేలా మాట్లాడతారా? అని ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి.. రేవంత్ నోటి నుంచి వచ్చిన మీరు మాటకు ఆయన క్షమాపణలు చెబుతారా? ‘మీరు’ అన్న మాటతో కలిగిన అవమానానికి ప్రతిగా పార్టీ నుంచి నిష్క్రమిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.