రాజ‌గోపాల‌రెడ్డికి ఏఐసీసీ షాక్‌.. ఆ దిశ‌గా నిర్ణ‌యం..?


మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డికి ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుందా..? కాంగ్రెస్ అధిష్ఠానం ఆ దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తుందా..? ఇది స్వ‌యంగా ఆయ‌న త‌ప్పిద‌మేనా..? రాజ‌గోపాల‌రెడ్డితో పాటు జ‌గ్గారెడ్డికి కూడా ఏఐసీసీ ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతుందా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి. వారిద్ద‌రిపై వేటు వేయాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

రాజ‌గోపాలరెడ్డి ఆది నుంచీ సొంత పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న అన్న వెంక‌టరెడ్డి ద్వారా రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన రాజ‌గోపాల‌రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప‌ద‌వులు పొందారు. అలాంటి వ్య‌క్తి క‌ష్ట‌కాలంలో పార్టీకి స‌హ‌కారం అందించాల్సింది పోయి.. పార్టీకి న‌ష్టం జ‌రిగే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. చేయాల్సింది అంతా చేస్తూనే ఏమైనా అంటే సోనియాకి, పార్టీకి విధేయుడిన‌ని త‌ప్పుల‌ను క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇప్పుడంటే తెలుగుదేశం నుంచి వ‌చ్చిన రేవంతుకి అధ్య‌క్ష ప‌ద‌వి అప్ప‌చెప్పినందుకు అసంతృప్తిగా ఉంద‌ని.. జైలుకి వెళ్లి వ‌చ్చిన వారు నీతులు చెబుతుంటే వారి కింద ప‌నిచేయ‌లేన‌ని డ‌ప్పాలు కొడుతున్నారు కానీ, ఆయ‌న వ్య‌వ‌హార శైలి మొద‌టి నుంచీ అలాగే ఉంది. రేవంత్ అంటే సంవ‌త్స‌రం నుంచీ అధ్య‌క్ష పోస్టులో ఉన్నారు. కానీ అంత‌కుముందు రాజ‌గోపాల‌రెడ్డి సొంత జిల్లాకే చెందిన అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆ ప‌ద‌విలో ఉన్నారు.

ఉత్త‌మ్ హ‌యాంలోనే రెండుసార్లు ఎన్నిక‌ల‌కు వెళ్లి బోల్తా ప‌డ్డారు. ఒక‌సారి 21 స్థానాలు, మ‌రోసారి 19 స్థానాల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ జిల్లా నుంచే మ‌హామ‌హులు జానారెడ్డి, ఉత్త‌మ్‌, పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డి, రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి, కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ వంటి వారు ప్రాతినిథ్యం వ‌హించారు. వీరంద‌రూ క‌లిసి కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీని అధికారంలోకి తేలేక‌పోయారు. మ‌రి దీనికి రాజ‌గోపాల‌రెడ్డి ఏం స‌మాధానం చెబుతార‌ని రేవంత్ వ‌ర్గీయులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఉత్త‌మ్ పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడే ఆయ‌న్నీ గౌర‌వించ‌లేదు రాజ‌గోపాల‌రెడ్డి. పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి కుంతియాను తీవ్ర ప‌ద‌జాలంతో దూషించారు. మూడున్న‌రేళ్ల కింద‌టే అభిమానుల బ‌హిరంగ స‌భ‌లో బీజేపీలోకి వెళ‌తాన‌ని సంకేతాలు ఇచ్చారు. అప్ప‌టి నుంచీ పార్టీకి దూరంగా ఉంటూ అప్పుడ‌ప్పుడూ అస‌మ్మ‌తి తెలియ‌జేస్తున్నారు. ఏఐసీసీ నిర్దేశించిన కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రుకాకుండా.. పార్టీని ప‌టిష్టం చేయాల్సిందిపోయి న‌ష్ట‌ప‌రిచే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఇంకా వేచి చూస్తే అది పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లుగుతుంద‌ని భావించిన అధిష్ఠానం ఇక సంచ‌ల‌న‌ నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సోనియా నియ‌మించిన వ్య‌క్తిని అగౌర‌వ‌ప‌రుస్తూ.. అమిత్ షా వంటి ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో మంత‌నాలు సాగిస్తున్నందుకు వేటు వేయాల‌నే యోచ‌న‌లో ఉంద‌ట‌. రాజ‌గోపాల‌రెడ్డితో పాటు రేవంతును ప‌నిచేయ‌కుండా కాళ్ల‌ల్లో పుల్లలు పెడుతున్న మ‌రో ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిపై కూడా తీవ్ర‌ నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!