వైసీపీ నాయకుడు.. సీనియర్ పొలిటీషియన్.. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత.. మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో తనపైనా.. తన కుటుంబం పైనా జరుగుతున్న రాజకీయ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను, తన కుటుంబం.. తన సొదరులు కూడా.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు అభిమానులమేనని ఆయన చెప్పుకొచ్చారు. తమ కుటుంబంపై వస్తున్న వార్తలను ఇప్పటికైనా కట్టిపెట్టాలన్నారు.
గత కొన్నాళ్లుగా.. మాగుంట వ్యవహార శైలిపై.. అనేక మీడియాల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల సమయంలో ఆయన టీడీపీ ఎంపీలకు పార్టీలు ఇవ్వడం.. వారితో కలిసి ఫొటోలు దిగడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. ఈ సమయంలోనే ఒంగోలులో వైసీపీ నేతలకు ఆయన అందుబాటులో లేకపోవడం.. మంత్రులు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో కూడా ఆయనకు పొసగక పోవడం వంటి పరిణామాల నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతున్నారనే వాదన బలపడింది.
అంతేకాదు.. కరోనా సమయం లో ప్రభుత్వం ఏమీ చేయడం లేదని.. చేసేది కూడా నామమాత్రంగానే ఉందని విపక్షాల కంటే ఎక్కువగానే ఆయన విమర్శించారు. కరోనా మందు తయారు చేసిన ఆనందయ్య తో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి తన సొంత ఖర్చులతో మందును పంపిణీ చేయడం.. కూడా వైసీపీ కి ఇబ్బందిగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి దూరమవుతున్నారనే చర్చ తెరమీదికి వచ్చింది.
అయితే.. ఈ వాదన ఒకవైపు బలపడుతున్న క్రమంలోనే.. తాజాగా మాగుంట మీడియా ముందుకు వచ్చి.. సీఎం జగన్ కనుసన్నల్లోనే తాను పనిచేస్తానని.. తాను.. తన కుటుంబం వైసీపీని వీడబోమని.. వేరే పార్టీలో చేరేది కూడా లేదని చెప్పారు. గత 2019 ఎన్నికల సమయంలో తనను జగన్ ఆహ్వానించారని.. ఆయన ఆహ్వానంతోనే వైసీపీలోకి వచ్చానని చెప్పారు. తాము పార్టీని విడిచి పెట్టేది లేదన్నారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.