టీడీపీ సీనియర్ నాయకుడు.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు అరుదైన ప్రశంస లభించింది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నుంచి పార్టీనాయకులు కితాబు కోరుకుంటారు. అయితే.. ఇదేమంత.. ఈజీగా లభించే కితాబు కాదు. ఎంతో కష్టపడి.. చెమటలు చిందించినా.. కూడా చంద్రబాబు ప్రశంసించరు. ఇంకా కష్టపడాలి.. ఇంకా ప్రజల్లోకి వెళ్లాలని చెబుతుంటారు. అయితే.. అదే చంద్రబాబు తాజాగా నిమ్మలను ఆకాశానికి ఎత్తేశారు.
“శభాష్.. బాగా పనిచేస్తున్నావ్!!” అని నిమ్మల భుజం తట్టి మరీ.. చంద్రబాబు ప్రశంసించారు. తాజాగా చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ప్రబావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. వరదతో అల్లాడిపోయిన ప్రజలను స్వయంగా పలకరించారు. ఈ క్రమంలో చిన్న చిన్న సందుల్లోకి.. లంక గ్రామాల్లోకి కాలి నడక.. బురదలోనే వెళ్లి ప్రజలను కలిశారు. వారికి అందిన సాయం పై ఆరా తీశారు. ఈ క్రమంలో చాలా మంది ఎమ్మెల్యే నిమ్మల తమకు చేసిన సేవను ప్రస్తావించారు.
తమకు అన్ని విధాలా ఆయన అండగా ఉన్నారని.. జోరు వర్షంలోనూ… తమ కోసం.. ఇక్కడకు వచ్చారని.. వరదతో నిండిపోయిన ప్రాంతాల్లోనూ.. బోట్లు వేసుకుని.. వచ్చి.. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెప్పారు. మూడు రోజుల పాటు.. తమతోనే ఉన్నారని.. కనీసం.. నిద్ర కూడా లేకుండా.. తమకు సేవలు చేశారని.. చాలా మంది చంద్రబాబు కు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న నిమ్మలను చూసి.. చంద్రబాబు “శభాష్” అంటూ.. ఆయన భుజం తట్టారు.
ప్రస్తుతం చంద్రబాబు చేసిన ప్రశంస.. నిమ్మలకు భారీ ఆక్సిజన్ నింపినట్టు అయింది. వాస్తవానికి .. గత ఎన్నికల్లో జగన్ సునామీని తట్టుకుని మరీ విజయం దక్కించుకున్న నిమ్మల.. పార్టీ తరఫున బలమైన గళం వినిపిస్తున్నారు. అదేసమయంలో ప్రజలకు కూడా ఆయన చేరువగా ఉంటున్నారు. వారికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నానంటూ.. ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఇదే పనిచేశారు. ఇదే.. ఆయనకు చంద్రబాబు వద్ద మంచి మార్కులు వేసేలా చేసి.. శభాష్ అని ప్రశంసించే వరకు వచ్చిందని.. నిమ్మల అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates