చంద్ర‌బాబు టోన్ మారిందే…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు టోన్ మారింది. గ‌తానికి భిన్నంగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌లో విస్తృతంగా తిరుగుతున్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు కూడా తిర‌గ‌బ‌డాలంటూ.. ఆయ‌న పిలుపునిస్తున్నారు. ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డితే.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తాన‌ని.. ప్ర‌జల‌కు అన్ని రూపాల్లోనూ పార్టీ అండ‌గా ఉంటుందని కూడా ఆయ‌న అంటున్నారు.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబులో పూర్తి మార్పు క‌నిపించింద‌ని అంటున్నారు పరిశీల‌కులు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు గ‌తంలో ఎప్పుడూ.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఆయ‌న ప్ర‌జాస్వామ్యయుతం గానే ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌జాపోరాటాలు చేయాల‌ని అనేవారు. కానీ, ఇప్పుడు పూర్తిగా ఆయ‌న టోన్ మార్చుకున్నారు. ఈ ప‌రిణామం.. టీడీపీలోను.,. ప్ర‌ధానంగా అధికార పార్టీ వైసీపీలోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు శాంతి యుతంగానే ఉన్నారు. ఆయ‌న ఎప్పుడూ.. పోరాటాల‌కు కూడా వ్య‌తిరేకంగా వ్యాఖ్యానించేవారు.

అయితే..రాను రాను.. వైసీపీ నేత‌ల ఆగ‌డాలు పెరిగిపోవ‌డం.. టీడీపీలో నాయ‌కుల‌పై తీవ్ర‌స్తాయిలో దాడులు పెరిగిపోవ‌డం.. కామ‌న్ అయిపోయింది. దీంతో పార్టీ కేడ‌ర్‌లో ఆత్మ‌స్థ‌యిర్యం త‌గ్గిపోతోంది. ఇది మున్ముందు ప్ర‌మాద‌మ‌ని గుర్తించిన చంద్ర‌బాబు.. పార్టీని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మం లోనే ఎక్క‌డిక‌క్క‌డ ఆయ‌న ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. నేనున్నానంటూ.. ముందుకు వ‌స్తున్నారు. ఈ స‌మయంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ ఆవేద‌న‌ను, బాధ‌ను చెప్పుకొంటున్నారు. దీంతో చంద్ర‌బాబు వారి బాధ‌లు చూసి చ‌లించి పోతున్నారు.

దీంతో ఆయ‌న ముల్లునుముల్లుతోనూ తీయాల‌నే సిద్ధాంతాన్ని పాటించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స్పష్టంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే పార్టీ త‌ర‌ఫున‌.. పోరాటాలు చేయాల‌ని.. తెగించాల‌ని.. ఏం జ‌రిగినా.. తాను చూసుకుంటాన‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు కూడా ఆయ‌న అభ‌యం ఇస్తున్నారు. అరాచ‌కాల‌పై పోరాడాల‌ని కూడా పిలుపునిస్తున్నారు. ఈ ప‌రిణామం.. టీడీపీలో ఒకింత జోష్ తీసుకువ‌స్తోంది. త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని భావిస్తున్న కార్య‌క‌ర్త‌లు ముందుకు వ‌స్తున్నారు. మ‌రి ఇది ఎన్నిక‌ల నాటికి పెరుగుతుందా లేదా.. చూడాలి.