ఉచిత బియ్యం పంపిణీకి ధాన్యం సేకరణకు కేంద్ర మంత్రి లింకుపెట్టారు. పేదలకు ప్రధానమంత్రి పేరుతో పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని అందించకపోతే ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బియ్యం, వడ్లు సేకరణను వెంటనే నిలిపేస్తామంటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయెల్ తీవ్రంగా హెచ్చరించారు. పీఎంజీకేఏవై 6వ దశలో ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని పీయూష్ గుర్తుచేశారు.
ప్రభుత్వ హామీ తర్వాత కేంద్రం ఏపీకి 8.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు కూడా మంత్రి తెలిపారు. ఈ పథకంలో బియ్యం పంపిణీ చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సుంటుందని పీయూష్ హెచ్చరించారు. ఈ పథకం కింద గడచిన ఐదు విడతల్లో 23,75,496 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించినట్లు కూడా ప్రకటించారు. తాము బియ్యం ఇవ్వటమే కానీ ఏపీ ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయటం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినపుడు తమ దగ్గరే కావాల్సినన్ని నిల్వలున్నాయని, కొన్ని నిర్దిష్టమైన సమస్యల కారణంగా పంపిణీ ఆలస్యమైందని మాత్రమే చెప్పినట్లు కేంద్రమంత్రి వివరించారు. తొందరలోనే పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్లు కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఏదేమైనా ఇంతకాలం తెలంగాణాలో మాత్రమే ఉన్న ధాన్యం సేకరణ వివాదం తొందరలో ఏపీకి కూడా పాకేట్లున్నది.
ధాన్యం సేకరణ విషయంలో చాలాకాలం తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రానికి మద్య పెద్ద వివాదమే నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకంగా కేసీయారే ధర్నాకు దిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దశలవారీగా మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలతో ఢిల్లీకి వెళ్ళి అక్కడే నిరసనలు తెలిపారు. దాంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అంతకాకపోయినా దాదాపు అలాంటి పరిస్ధితే ఏపీ విషయంలో కూడా తలెత్తుతుందా అనే డౌటు పెరిగిపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates