ఔను.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్, సీతక్క.. అనుకున్నది ఒకటైతే.. చేసిందిమరొకటి. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె తడబడ్డారు. ఆది నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కేంద్ర పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయా రాష్ట్రాలకు తిరిగి మరీ.. సిన్హాకు ఎలా ఓటేయాలో కూడా నేర్పించారు.
ఎందుకంటే.. బీజేపీ అభ్యర్థికి పోటా పోటీగా నిలబెట్టిన సిన్హాకు కనీసం.. మెజారిటీ ఓటు బ్యాంకు రావడం ద్వారా.. ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయనే సంకేతాలు పంపించాలని .. కాంగ్రెస్ భావించింది. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో సభ్యులకు ముందుగానే మాక్ పోలింగ్ కూడా నిర్వహించా రు. ఇక, తెలంగాణలోనూ శాసన సభ్యులకు పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే సిన్హానే మన నాయకుడు అని సూచించారు.
అంతా బాగానే జరిగింది. కానీ, తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో సీతక్క మాత్రం బీజేపీ అభ్యర్థి ముర్ముకు ఓటు గుద్దేశారు. ఆ తర్వాత.. తీరిగ్గా నాలుక కరుచుకున్నారు. అయ్యో.. నేను తప్పు చేశాను.. అని లబోదిబో మన్నారు. అంతేకాదు.. మరోసారి ఓటు వేస్తాను.. అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ.. అధికారులను ప్రాథేయ పడ్డారు. అయితే.. నిబంధనల ప్రకారం.. అలా కుదరదని.. అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన సీతక్క.. ఈ విషయం మీడియాకు చెప్పుకొని లబోదిబో మన్నారు.