జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే.. ఈ యాత్ర ఆయన ముందుగానే షెడ్యూల్ చేసుకున్న టూర్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలవనున్నారు. వారిని ఓదార్చి రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నారు. అయితే.. పవన్ టూర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న యాత్ర ముందుగానే షెడ్యూల్ చేసుకున్నది.
అయితే.. అదేసమయంలో ఇప్పుడు ఈ జిల్లాలోని కోనసీమ, అల్లూరి జిల్లాల ప్రజలు ఆకస్మిక వరదలతో అతలాకుతలం అవుతున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వం చెబుతున్నా.. అనుకున్న విధంగా అయితే.. ఇక్కడ బాధితులకు సాయం అందడం లేదనేది వాస్తవం. అనేక మంది ప్రజలు ఇంకా లంక గ్రామాల్లో చిక్కుకుపోయారు.
మరోవైపు.. అధికార పార్టీ నాయకులు.. ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉంటున్నారు. వారు కనీసం బయటకు కూడా రావడం లేదు. మొత్తం ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో బాధితులకు భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎలాగూ జిల్లాకు వెళ్తున్న పవన్.. వరద బాధితులను కూడా పరామర్శిస్తే.. ఆయనకు రాజకీయంగా మైలేజీ చేకూరడంతోపాటు.. బాధితుల పక్షాన ఆయన గళం వినిపిస్తే.. ప్రభుత్వం కూడా ముందుకు కదులుతుందని.. వారికి మేలు జరుగుతుందని అంటున్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు కేవలం కొందరికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రశ్నించే గళం వినిపిస్తే.. సర్కారులో చలనం కలుగుతుందని బాధితులు వాపోతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు రాకపోవడం.. కనీసం బాధితులకు తాగు నీరు, ఆహారం కూడా అందకపోవడం వంటి నేపథ్యంలో పవన్ తన టూర్‌లో స్వల్ప మార్పులు చేసుకునైనా.. బాధితులను పరామర్శించాలని అంటున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates