టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ లో కనపడుతున్నారా..? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నారా..? అధిష్ఠానం అండతో దూసుకుపోతున్నారా..? టీఆర్ఎస్, బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందు వరుసలో నిలిచిందా..? అందుకే ఆ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయా..? రేవంతును వ్యతిరేకించే సీనియర్లు సైతం సైలెంట్ అయ్యారా..? ఇక ఆయన టార్గెట్ ఆ ఇరవై మంది నేతలేనా..? అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు పర్యాయాల ఎన్నికల కంటే.. రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉత్తమ్ హయాంలో జరిగిన రెండు ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా చతికిలపడింది. గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన కారెక్కించుకున్నారు. దీంతో హస్తం శ్రేణులు డీలా పడిపోయాయి. అండగా నిలిచే వారు లేక చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు.
దీంతో పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావగా తయారైంది. నష్టనివారణ చర్యలు చేపట్టిన ఏఐసీసీ రేవంతుకు పగ్గాలు అందించింది. ఈ నిర్ణయాన్ని ఎంతో మంది సీనియర్లు వ్యతిరేకించినా అధిష్ఠానం కార్యకర్తల మనోభీష్టానికే పెద్దపీట వేసింది. ఇక అక్కడి నుంచి రేవంత్ వెనుదిరిగి చూసుకోలేదు. తన దూకుడుతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలతో కాంగ్రెస్ పట్ల నమ్మకం కలిగించారు. డైలమాలో ఉన్న చాలా మంది నేతలను టీఆర్ఎస్, బీజేపీ వైపు వెళ్లకుండా ఆపగలిగారు.
రాహుల్ గాంధీ వరంగల్ సభను సక్సెస్ చేయడంతో రేవంత్ ఘనత సాధించారు. రైతు డిక్లరేషన్ పేరిట రచ్చబండ సమావేశాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ విధానాలతో విసిగిపోయిన ప్రజలు కూడా కాంగ్రెస్ ను నమ్మడం మొదలుపెట్టారు. దీంతో ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి వాదులు హస్తానికి చేతులు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ముందస్తు బెర్తుల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
అందులో భాగంగా పార్టీలోకి ఇటీవల వలసలు ఊపందుకున్నాయి. నల్లాల ఓదెలు, రావి శ్రీనివాస్, బోడ జనార్దన్, తాటి వెంకటేశ్వర్లు, ఎర్ర శేఖర్, బాలు నాయక్, విజయా రెడ్డి, గ్రేటర్ పరిధిలోని ఒక మేయర్ ఇలా ఆయా పార్టీల నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉండడం గమనార్హం. అయితే టీపీసీసీ ఇక్కడితో సంతృప్తి పడడం లేదని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి రావాలంటే మరిన్ని చేరికలు ఉండాలని కోరుకుంటోంది.
ఇందులో భాగంగా టీఆర్ఎస్, బీజేపీలో ఉన్న 20 మంది కీలక నాయకులకు రేవంత్ గాలం వేస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, వేముల వీరేశం, పిడమర్తి రవి.. బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్, జితేందర్ రెడ్డి, వివేక్, కూన శ్రీశైలం గౌడ్ ఇంకా కొందరు ముఖ్య నేతలపై వల విసురుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరితో ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని.. మరికొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 2న సిరిసిల్లలో రాహుల్ గాంధీ సభలో కొందరి చేరికలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు రేవంత్. చూడాలి మరి ఏం జరుగుతుందో..!