విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం మెల్లిగా చంపేస్తోంది. విశాఖ స్టీల్స్ లో రెండు రకాల ఉత్పత్తులు జరుగుతుంటాయి. మొదటిదేమో ఉక్కు ఉత్పత్తి కాగా రెండోదేమో విద్యుత్ ఉత్పత్తి. ఆక్సిజన్ కూడా ఉత్పత్తవుతుంది కానీ అది ఫ్యాక్టరీ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. కాకపోతే కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైపోయినపుడు కేంద్రం ఆదేశాల కారణంగా ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేసి దేశానికి అందించిన ఘనత విశాఖ స్టీల్స్ కే సొంతమని అందరికీ తెలుసు.
పై మూడింటిలో దేన్ని ఉత్పత్తి చేయాలన్నా ముఖ్యంగా కావాల్సింది బొగ్గు. ఇపుడా బొగ్గు సరఫరా మీద కేంద్రం అప్రకటిత బ్యాన్ విధించింది. దీని ఫలితంగా అవసరమైన బొగ్గు నిల్వలు అందక ఉక్కు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా పడిపోయింది. ఒడిస్సాలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుండి విశాఖ ఉక్కుకు ఏడాదికి 16.8 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఒప్పందం జరిగింది. ప్రతినెలా 1.4 లక్షల టన్నుల బొగ్గు రావాలి. బొగ్గు సరఫరా అంతా రైల్వే ర్యాక్స్ ద్వారానే జరగుతుంది.
అయితే జూన్ నెలలో ఒక్క ర్యాక్ బొగ్గు కూడా ఫ్యాక్టరీకి అందలేదు. అంటే జూన్ నెల మొత్తంలో మహానది నుండి బొగ్గు సరఫరా కాలేదు. దాంతో మహానదిని పక్కనపెట్టి సింగరేణి నుండి అధికారులు బొగ్గును కొన్నారు. మహానది నుండి అయితే టన్ను బొగ్గు సరఫరాకు 3 వేల రూపాయలు పడితే సింగరేణి నుండి రు. 6300 అయ్యింది. అయినా కూడా సింగరేణి నుండి బొగ్గు సరిపడా అందలేదు. దాంతో లాభం లేదని ప్రైవేటు కంపెనీల నుండి బొగ్గు కొనాలని డిసైడ్ అయ్యింది. ప్రైవేటు కంపెనీల నుండి టన్ను బొగ్గు సరఫరాకు రు. 15 వేలవుతుందని అంచనా వేశారు. దాంతో ఏమి చేయాలో తెలీక అధికారులు దిక్కులుచూస్తున్నారు. అంటే ఇదంతా కూడా కేంద్రం కావాలనే చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఫ్యాక్టరీని ప్రైవేటుకు అప్పగించేయటం లేదా మూసేయాలని నరేంద్ర మోడీ సర్కార్ డిసైడ్ చేసింది. దానికి ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించటంతో మోడీ సర్కార్ ఇలా ఇబ్బందులు పెడుతోంది.