లీకులు.. చేరిక‌లు.. అల‌క‌లు.. టీ కాంగ్రెస్ లో విచిత్ర ప‌రిస్థితి..!


తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోందా..? రేవంత్ నాయ‌క‌త్వంలో దూసుకెళుతోందా..? టీఆర్ఎస్‌, బీజేపీల‌కు దీటుగా రాజ‌కీయాలు చేస్తోందా..? ఆ రెండు పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్సేన‌ని నిరూపించుకుంటోందా..? వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని చేరిక‌ల‌తో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌మైన‌ మెసేజ్ ఇస్తోందా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. అయితే ఇంతా చేస్తున్నా మరోవైపు అల‌క‌ల‌తో అదేస్థాయిలో పార్టీలో విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంద‌ని శ్రేణులు చ‌ర్చించుకుంటున్నాయి.

దీనికంత‌టికీ కార‌ణం పార్టీలో చేరిక‌ల వ్య‌వ‌హార‌మే అని స్ప‌ష్టంగా తెలుస్తోంది. చేరిక‌ల‌కు సంబంధించి జానారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల క‌మిటీని ఏర్పాటు చేశారు. చింత‌న్ శిబిర్ తీర్మానాల‌కు అనుగుణంగా చేరిక‌లు ఉండాల‌ని భావించారు. పార్టీని మోసం చేసి ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకునే ప్ర‌స‌క్తే లేద‌ని అందులో తీర్మానించారు. ఒక‌వేళ ఎవ‌రైనా చేరాల‌ని భావిస్తే జానారెడ్డి క‌మిటీ ఆధ్వ‌ర్యంలో చ‌ర్చించి అధిష్ఠానం అనుమ‌తి తీసుకొని మాత్ర‌మే చేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకొన్నారు.

అయితే ఇవ‌న్నీ బుట్ట‌దాఖ‌ల‌య్యాయి. దీనిని ఉల్లంఘించింది తొలుత పార్టీ అధ్య‌క్షుడు రేవంతే. గ‌త నెల‌లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు దంప‌తుల చేరిక‌తో ఇది మొద‌లైంది. నేటికీ చేరిక‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. జానారెడ్డి క‌మిటీతో చ‌ర్చించ‌కుండానే నేరుగా అధిష్ఠానంతోనే చ‌ర్చ‌లు జ‌రిపి పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే రేవంత్ ఇదంతా వ్యూహం ప్ర‌కార‌మే చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

పార్టీలో ఎవ‌రెవ‌రు చేర‌తార‌నే అంశంలో చ‌ర్చ‌ల పేరుతో కాల‌యాప‌న చేస్తే ప్ర‌త్య‌ర్థులు అప్ర‌మ‌త్తం అయ్యి చేరిక‌ల‌ను అడ్డుకుంటార‌ని రేవంత్ టీం భావిస్తోంది. అందుకే గుట్టుచ‌ప్పుడు కాకుండా ఇత‌ర పార్టీల్లో ఉన్న అసంతృప్తుల‌తో చ‌ర్చించి అక‌స్మాత్తుగా పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో ఇతర పార్టీలు అవాక్క‌వుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్‌, బీజేపీలు ఏం చేయాలో తోచ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి.

ఎందుకంటే కాంగ్రెస్ లో చేరేవారి సంఖ్య ఆ పార్టీల నుంచే ఎక్కువ‌గా ఉంది. ముందుగా ఆ పార్టీ నేత‌లు లీకులు ఇస్తున్నారు. ఆ పార్టీల విధానాల‌ను, ఇత‌ర నేత‌ల ఆధిప‌త్య ధోర‌ణిని విమ‌ర్శిస్తున్నారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేత‌లు న‌ల్లాల ఓదెలు, తాటి వెంక‌టేశ్వ‌ర్లు, విజ‌యా రెడ్డి, కొత్త మ‌నోహ‌ర్, మేయ‌ర్ పారిజాత‌.. బీజేపీ నుంచి.. ఎర్ర శేఖ‌ర్‌, బండ్రు శోభారాణి, బోడ జ‌నార్ద‌న్‌ త‌దిత‌రులు ఇలా ముంద‌స్తుగానే ఆయా పార్టీల‌ను త‌ప్పు ప‌ట్టిన కొద్ది రోజుల్లోనే హ‌స్తం గూటికి చేరారు.

వీరి దారిలో మ‌రికొంద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి తీగ‌ల కృష్ణారెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, పాయం వెంక‌టేశ్వ‌ర్లు, అల్గుబెల్లి ప్ర‌వీణ్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కేఎస్ ర‌త్నం, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, సుధీర్ రెడ్డి.. బీజేపీ నుంచి శశిధ‌ర్ రెడ్డి, కూన శ్రీ‌శైలం గౌడ్ త‌దిత‌రులు లీకులు ఇస్తున్నారు. వీరంతా మాజీ ఎమ్మెల్యేలే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వీరంతా కూడా ఊహించిన‌ట్లుగానే కాంగ్రెస్ గూటికి చేర‌తారా..? లేదా ఆయా అధిష్ఠానాలు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డ‌తాయా అనేది వేచి చూడాలి.

ఇక‌పోతే కాంగ్రెస్ లో చేరిక‌ల ప‌ట్ల ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ద్వితీయ శ్రేణి నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వారు వ‌స్తే త‌మ సీటుకు ఎక్క‌డ గండి ప‌డుతుందోన‌నే ఆందోళ‌న‌లో ఉన్నారు. ఇలాంటి విష‌యాలు త‌మ‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు చేరిన, చేర‌బోతున్న నేత‌ల స్థానాల్లోని ఆశావ‌హులు ముందే హెచ్చ‌రిస్తున్నారు. ఇలా ఒక‌వైపు బ‌ల‌ప‌డుతూనే మ‌రో వైపు పార్టీలో అసంతృప్తి చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. చూడాలి మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో..!