జంపింగులతో కాంగ్రెస్ కళకళ

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జంపింగుల విషయంలో మూడు ప్రధాన పార్టీల్లోను అయోమయం పెరిగిపోతోంది. ఏ నేత ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో జనాలకు అర్థం కావటం లేదు. నిన్నటిదాకా కాంగ్రెస్, బీజేపీలను తిట్టిపోసిన కారుపార్టీ నేతలు హఠాత్తుగా పై రెండు పార్టీల్లో ఏదో ఒకపార్టీ కండువా కప్పుకుని కనబడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీలో ఉంటు కేసీయార్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో ఆరోపణలు, విమర్శలు గుప్పించిన కమలం పార్టీ నేతలు మరుసటి రోజు గులాబీ కండువా కప్పుకుని కనబడుతున్నారు.

ఇక బీజేపీ, టీఆర్ఎస్ లోని నేతలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీభవన్లో కనబడుతున్నారు. దీంతో ఏ నేత ఏరోజు ఏపార్టీలో ఉంటారో మామూలు జనాలకు కాదుకదా చివరకు సదరు నేతల సహచరులకు కూడా అర్ధం కావటంలేదు. పార్టీల మధ్య ఇంత గందరగోళానికి, జంపింగులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై అనుమానాలు మొదటి కారణం.

ఇక రెండో కారణం ఏమిటంటే తాము పోటీచేసేందుకు టికెట్ వస్తుందో రాదో అనే గ్యారెంటీ లేకపోవటం. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం ఉన్న నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ లో నుండి కమలం పార్టీలో చేరిపోతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం గ్యారెంటీ అనే నమ్మకంతోనే కొందరు నేతలు టీఆర్ఎస్, బీజేపీలో నుండి జంపయిపోతున్నారు. టీఆర్ఎస్ లో కూడా కొందరు చేరుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో మాత్రం కాదు.

హోలు మొత్తం మీద చూస్తే బీజేపీ, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిపోయేందుకు ఎక్కువమంది నేతలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెసే అనే ప్రచారం పెరిగిపోతోంది. దీనికి అనుగుణంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పావులు కదుపుతున్నారు. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ లోని కొందరు సీనియర్ నేతలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.