గత కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్న సలహాదారు బొంతు రాజేశ్వరరావు (రాజోలు నియోజకవర్గం) సర్కారు పదవి వద్దేవద్దని అంటున్నారు. ఈ మేరకు తన పదవికి రాజీనామా చేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కలిసి పనిచేయాలని చెబుతున్నారని, గతంలో ఆయన్ను వ్యతిరేకించిన తామే ఇప్పుడెలా కలిసి పనిచేయగలం అని వారంతా ఆవేదన చెందుతున్నారు.
దీంతో పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా సలహాదారుగా ఉన్న ఆయన తన పదవికి గుడ్ బై కొట్టేశారు. తన పదవి కారణంగా నియోజకవర్గానికి కానీ తన కార్యకర్తలకు కానీ ఎటువంటి లాభం లేదని తేల్చేశారు. గతంలో రెండు సార్లు పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఇప్పుడు మరింత అసంతృప్తితో ఉన్నారు. తమ నాయకుడికి వెన్నుపోటు పొడిచిన వారితోనే కలిసి పనిచేయమని అధిష్టానం చెప్పడం ఏం బాలేదని అంటున్నారు బొంతు రాజేశ్వరరావు కార్యకర్తలు. దీంతో రాజోలులో అనిశ్చితి నెలకొంది.
ఎన్నో సార్లు తమకు ప్రాధాన్యం లేదని, కల్పించాలని వేడుకున్నా అధిష్టానం పట్టించుకోలేదని బొంతు వర్గీయులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ విధంగా వారంతా నిరాశలో ఉండిపోయారు. రాజోలులో తమను కాదని ఇక్కడి ఎమ్మెల్యే రాపాక కు ప్రాధాన్యం ఇవ్వడం ఏమాత్రం ఇష్టంలేని వీరంతా త్వరలోనే అధిష్టానం నిర్ణయం తెలుసుకుని, పార్టీని వీడిపోతారని కూడా సమాచారం.
గత ఎన్నికల్లో జనసేన ఇక్కడ ఒక్క చోటే గెలిచింది. గెలిచాక రాపాక వర ప్రసాదరావు అనూహ్య రీతిలో వైసీపీకి మద్దతుగా పనిచేయడం, అసెంబ్లీలో కూడా వైసీపికి మద్దతుగా పనిచేయడం మొదలు పెట్టాక పరిస్థితులు మారిపోయాయి. ఇవే పవన్ కు కోపం తెప్పించాయి. దీంతో ఆయన్ను పార్టీ నుంచి తప్పించారు. అయితే పార్టీ నుంచి తప్పించినా అనర్హత వేటు అయితే వేయలేదు.
దీంతో ఆయన ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేగానే శాసన సభ రికార్డుల్లో కొనసాగుతున్నారు.
కానీ కార్యకర్తలు మాత్రం రాపాక పేరు చెబితే చాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమకు ఆయన తీరని అన్యాయం చేశారని అంటున్నారు. దీంతో రాపాక వర్గం వారిని నిలువరించే ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలీకృతం కాలేదని కూడా తెలుస్తోంది.అటు వైసీపీలోకి వెళ్లినా ఇప్పటిదాకా పార్టీ కోసం పనిచేసిన వారంతా రాపాక రాకను, సారథ్యాన్నీ వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే వివాదాలు రేగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates