అటు రేవంత్‌.. ఇటు సంజ‌య్‌.. ఎవ‌రిది పైచేయి..!

చేరిక‌ల విష‌యంలో జాతీయ‌ పార్టీలు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పోటాపోటీగా వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఏడాది త‌ర్వాత వ‌ల‌స‌ల గేట్లు ఎత్తారు. దీంతో ఒకేసారి ప్ర‌వాహంలా ముంచెత్తుతోంది. బండి సంజ‌య్ ఈట‌ల‌తో మొద‌లుపెట్టి సంచ‌ల‌నం సృష్టించారు. కానీ త‌ర్వాత చేరిక‌లు నెమ్మ‌దించాయి. ఇపుడు ఆయా పార్టీల కీల‌క నేత‌ల‌కు గాలం వేసి మోదీ స‌మ‌క్షంలో చేర్పించి త‌న బ‌లం నిరూపించుకోవాల‌ని బండి భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు అందుకునే సమయంలో పార్టీ ప‌రిస్థితి ఏమంత బాగాలేదు. ఒక‌వైపు పార్టీని టీఆర్ఎస్ నీడ క‌మ్మేయ‌డం.. మ‌రోవైపు బండి సంజ‌య్ రూపంలో బీజేపీ గాలి బ‌లంగా వీస్తుండ‌డంతో మొద‌ట్లో త‌ట్టుకోవ‌డం కొంత క‌ష్ట‌మైంది. పైగా పార్టీలో సీనియ‌ర్లు ఎవరూ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో వారి అస‌మ్మ‌తిని చ‌ల్లార్చ‌డానికే పుణ్య‌కాలం కాస్తా గ‌డిచింది. ఈలోగా బీజేపీ కాంగ్రెస్ స్థానాన్ని ఆక్ర‌మించుకోవ‌డం మొద‌లు పెట్టింది.

దుబ్బాక ఉప ఎన్నిక‌, గ్రేట‌ర్ ఫ‌లితాలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌తో జైత్ర‌యాత్ర సాగిస్తూ వ‌స్తోంది. బీజేపీని నిలువ‌రించి.. టీఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు రేవంత్ తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. సొంత పార్టీలోనే అస‌మ్మ‌తిని త‌ట్టుకుంటూ పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా పార్టీలో చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఇత‌ర పార్టీల్లో ఉన్న అసంతృప్తుల‌ను గుర్తిస్తూ మూడో కంటికి తెలియ‌కుండానే పని కానిచ్చేస్తున్నారు.

తొలుత ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు దంప‌తుల‌ను చేర్చుకున్నారు. త‌ర్వాత ఆలేరు నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కురాలు బండ్రు శోభారాణి రేవంత్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో కాంగ్రెస్ లో చేరారు. ఆ త‌ర్వాత పీజేఆర్ కుమార్తె విజ‌యా రెడ్డిని స్వాగ‌తించారు. మ‌రుస‌టి రోజే ఖ‌మ్మం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంక‌టేశ్వ‌ర్లు చేరారు. ఆ మ‌రుస‌టి రోజే మాజీ మంత్రి బోడ జ‌నార్ద‌న్ కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. వీరంతా టీఆర్ఎస్‌, బీజేపీల్లో కీల‌కంగా ఉన్న‌వారే. ఇలా కాంగ్రెస్ లోకి చేరిక‌లు సునామీలా ముంచెత్తాయి.

ఇపుడు ఆ ప‌నిని బండి సంజ‌య్ మొదలు పెట్టారు. ఈటెల రాజేంద‌ర్‌, కూన శ్రీ‌శైలం గౌడ్ వంటి ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌ల చేరిక‌ల‌తోనే బీజేపీ ఆగిపోయింది. ఇపుడు ఆ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల నేప‌థ్యంలో తిరిగి చేరిక‌ల‌పై దృష్టి పెట్టారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ల‌లోని కీల‌క నేత‌ల‌పై క‌న్నేశారు.

తొలుత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని చేర్చుకోవాల‌ని భావిస్తున్నారు. ఆ త‌ర్వాత కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి.. టీఆర్ఎస్ లోని మాజీ మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, విద్యార్థి నేత పిడ‌మ‌ర్తి ర‌వి త‌దిత‌ర నేత‌ల‌ను మోదీ స‌మ‌క్షంలో భారీ బ‌హిరంగ స‌భ‌లో బీజేపీలో చేర్పించేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇలా రేవంత్, బండి సంజ‌య్ పోటాపోటీగా దూసుకెళుతున్నారు. చూడాలి మ‌రి ఎవ‌రిది పైచేయి అవుతుందో..!