దేశ ప్రజలపై మరిన్ని భారాలు పడనున్నాయి. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడి పోతున్నారు. రుణాలపై వడ్డీలు బాదేశారు. ఇలాంటి సమయంలో అంతో ఇంతో ఉపశమనం ఇస్తుందని భావించిన జీఎస్టీ మండలి సమావేశం.. ప్రజలపై మరిన్ని బాదుళ్లు బాదేసింది. అప్పడాల నుంచి గోధుమ పిండి వరకు, చేపల నుంచి మజ్జిగ వరకు బ్యాంకులో డబ్బులు బదిలీ చేసినా.. వేసినా.. పెన్సిళ్ల నుంచి షార్ప్‌నర్ల వరకు కూడా బాదుడు బాదేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.
ఈ బాదుడు విధంబెట్టిదనిన..
- ప్యాక్ చేసిన లేబుల్డ్ గోధుమపిండి, అప్పడాలు, పన్నీర్, పెరుగు, మజ్జిగ – లస్సీ, మాంసం (ఫ్రోజెన్ మినహాయించి), చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లు-మఖానా, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ పైనా ఇక నుంచి 5 శాతం జీఎస్టీ పడుతుంది.
- రూ.1000 కంటే తక్కువ విలువైన హోటల్ గదుల అద్దెపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తారు. ఆసుపత్రిలో ఒక రోగికి రూ.5000కి మించి గది అద్దె తీసుకుంటే, ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ పడనుంది. బ్యాటరీ ప్యాక్ అమర్చినా, లేకున్నా విద్యుత్తు వాహనాలకు 5 శాతం జీఎస్టీ ఖరారు చేశారు.
- ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్‌లపై పన్ను 12 నుంచి 18 శాతానికి పెంపు
- కత్తులు, బ్లేడ్లు, పేపర్ కత్తులు, పెన్సిల్ చెక్కుకునే షార్ప్‌నర్లపైనా 18% పన్ను
- ఎల్ఈడీ లైట్లు, ఫిక్సర్, వాటికి వినియోగించే మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్‌బోర్డులపై 12 నుంచి 18 శాతానికి పెంచారు.
- సోలార్ వాటర్ హీటర్, సిస్టంపై 5 నుంచి 12 శాతానికి పెంపు
- చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ జాబ్‌వర్క్‌లపై 5 నుంచి 12 శాతానికి పెంపు
- రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శుద్ధి ప్లాంట్లు, శ్మశానవాటికల కాంట్రాక్టు వర్కులపై 12 నుంచి 18 శాతానికి పెంపు
- టెట్రా ప్యాక్‌పై 12 నుంచి 18 శాతానికి పెంపు
- కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలపై 0.25 నుంచి 1.5 శాతానికి పెంపు
- కొత్తపన్ను రేట్లు జూలై 18 నుంచి అమల్లోకి రానున్నాయి.