“సమస్యలకు మూలం టీడీపీ నాయకుడు.. చంద్రబాబు. ఆయన కనిపిస్తే.. కొట్టండి.. మీకు ఇంకా ధైర్యం ఉంటే.. నరికేయండి. ఆయన వల్లే.. రాష్ట్రం నాశనం. గిరిజనుల జీవితాలు నాశనం” అని.. వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తీవ్ర దుమారానికి ఆయన తెరదీశారు. రాష్ట్రంలో గిరిజనుల సమస్యలపై కొందరు గిరిజన మహిళలు.. ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆయన సహనం కోల్పోయారు. చంద్రబాబు వల్లే.. ఏ పనీ ముందుకు సాగడం లేదన్నారు.
అందుకే.. ఆ చంద్రబాబును కొట్టండి.. ధైర్యముంటే నరకండి.. అని ఫల్గుణ గిరిజన మహిళలకు పిలుపుని చ్చారు. “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన.. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దని హెచ్చరించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట పంచాయతీ కేంద్రంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే ఫల్గుణకు ఆ పంచాయతీ పరిధిలోని గిరిజనులు సమస్యలు ఏకరువుపెట్టారు. తమ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని.. రహదారులు, మంచినీటి, మౌలిక సదుపాయాలు లేక అల్లాడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు స్పందిస్తూ.. రహదారులు మంజూరు అయినప్పటికీ నిధులు లేకపోవడంతో నిలిచిపోయాయ ని చెప్పారు. కొత్త రాష్ట్రం కాబట్టి నిధులు లేవని చెప్పారు. అయినా.. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కదా అంటూ.. ఎంపీపీ, జడ్సీటీసీ సభ్యులు చెప్పడంతో.. గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంచాయ తీని దత్తత తీసుకొని.. మూడేళ్ల పాలనలో ఏమి చేశారంటూ నిలదీశారు. గిరిజనులు ఇలా ప్రశ్నల వర్షం కురిపించడంతో.. ఎమ్మెల్యేలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
“సమస్యలు చెప్పండి కానీ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు” అన్నారు ఎమ్మెల్యే. ఈ మాటలకు స్థానికులు మరింత మండిపడడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇల్లు లేదని ప్రశ్నించగా.. “ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేయడం వల్ల నిలిచిపోయాయి.. కాబట్టి వారినే ప్రశ్నించండి, తిరగబడి కొట్టండి, ధైర్యం ఉంటే నరకండి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates