ఉధ్ధవ్ అట్టర్ ఫెయిలయ్యారా ?

పరిపాలనలో అధికార యంత్రాంగాన్ని నడిపించటంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు ఎలాగుందో తెలీదు. అయితే ఇంటెలిజెన్స్ ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవటంలో మాత్రం అట్టర్ ఫెయిలైనట్లు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యమంత్రిగానే కాదు పార్టీ అధినేతగా కూడా విఫలమయ్యారు. ఇంటెలిజెన్స్ శాఖ యావత్తు ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంటుంది.

అలాగే పార్టీ అధినేతగా పార్టీలో ఏమి జరుగుతోందో వెంటనే తెలుసుకునే యంత్రాంగం కూడా ఉద్థవ్ చేతిలోనే ఉంటుంది. అలాంటిది ఇటు సీఎంగా అటు పార్టీ అధినేతగా ఉండి కూడా పార్టీలో తిరుగుబాటు మొదలవ్వబోతోందని, ఆ తిరుగుబాటు తన సీటుకే ఎసరు తెస్తుందని చివరి నిముషం వరకు సీఎంకు తెలీకపోయిందంటే ఆయన నూరుశాతం ఫెయిలయ్యారని కాక మరేవిధంగా చూడాలి. ఇక్కడ థాక్రే ఫెయిల్యూర్లు రెండు విధాలుగా ఉన్నాయి.

మొదటిదేమో ఎంఎల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఒకరు ఓడిపోవటం. సంఖ్యా బలం రీత్యా మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి తరపున ఆరుగురు గెలవాల్సుండగా ఐదుగురే గెలిచారు. ఇక్కడే థాక్రే మేల్కొనుండాల్సింది. తమ కూటమి తరపున పోటీ చేసిన వారిలో ఒకళ్ళు ఓడిపోవటమే కాకుండా ప్రత్యర్ధి బీజేపీ తరపున అదనంగా ఒకళ్ళు గెలిచారు. ఇక్కడే థాక్రే ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని గ్రహించుండాలి. అలా గ్రహించలేకపోవటం కచ్చితంగా సీఎం ఫెయిల్యూర్ అనే చెప్పాలి.

కూటమిలోని ఒకళ్ళు ఓడిపోయిన వెంటనే తమ ఎంఎల్ఏలందరినీ పిలిచి సమావేశం పెట్టుంటే విషయం బయటపడుండేది. అయితే థాక్రే ఎంఎల్ఏలతో మీటింగ్ పెట్టలేదు. కూటమిలోని ఎన్సీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏల ఓట్లన్నీ వాళ్ళకే పడ్డాయి. శివసేన ఎంఎల్ఏల ఓట్లే క్రాస్ అయ్యాయి. ఈ విషయం తెలిసీ థాక్రే ఉదాసీనంగా వ్యవహరించారు. ఇక్కడే ఇంటెలిజెన్స్, పార్టీ ఇంటెలిజెన్స్ రెండూ ఫెయిలయ్యాయని అర్ధమైపోతోంది. మంత్రులను, ఎంఎల్ఏలను సరిగా కలవకపోవటం, వారితో మంచి సంబంధాలు మైన్ టైన్ చేయకపోవటం కూడా థాక్రే తప్పే. ఇదే విషయాన్ని రెబల్ ఎంఎల్ఏ స్పష్టంగా థాక్రేకి రాసిన లేఖలో చెప్పారు. ఏదేమైనా సీఎంగా థాక్రే ఫెయిలయ్యారన్నది వాస్తవం.