మిత్రపక్షం బీజేపీకి జనసేన హ్యాండిచ్చినట్లే అనిపిస్తోంది. ఏ విషయంలో హ్యాండిచ్చిందంటే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో. ఆత్మకూరులో పోటీ చేస్తున్నట్లు అప్పట్లో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించారు. జనసేనకు పోటీ చేసే ఉద్దేశ్యం లేకపోయినా కనీసం వాళ్ళతో బీజేపీ సంపద్రించనుకూడా లేదు. ఎలాగూ తమకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదు కాబట్టే సోము వీర్రాజు ప్రకటనను జనసేన నేతలు కూడా పట్టించుకోలేదు.
సరే అభ్యర్థి ప్రకటన అయిపోయింది సరే మరి ప్రచారం మాటేమిటి ? ఇక్కడే జనసేన వైఖరి పరోక్షంగా బయటపడింది. బీజేపీ అభ్యర్థి తరపున జనసేన నేతలెవరూ ప్రచారం చేయలేదు. కనీసం మిత్రపక్షం అభ్యర్ధికి ఓట్లయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పీలు కూడా చేయలేదు. పవన్ చేయకపోతే పోయాడు కుడిభుజం లాంటి నాదెండ్ల మనోహర్ కూడా ప్రచారంలో కనబడలేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి కూడా మద్దతు ప్రకటించలేదు.
జరిగింది చూసిన తర్వాత రెండు పార్టీల మధ్య పెరిగిపోయిన గ్యాప్ స్పష్టంగా కనబడుతోంది. ఏవో తెరవెనుక కారణాల వల్ల తమ పార్టీలు కలిసున్నట్లు రెండు పార్టీల నేతలు నటిస్తున్నారే కానీ వాస్తవంగా కలిసున్నది లేదు. ఎక్కడైనా మీడియా సమావేశాల్లో మాత్రం తమ పార్టీలు కలిసే ఉన్నాయని, వచ్చే ఎన్నికలను కలిసే ఎదుర్కొంటామని చిలక పలుకులు పలుకుతున్నారు. తమ ప్రకటనల్లో నిజాయితీ లేదని రెండు పార్టీల నేతలకూ బాగా తెలుసు.
ఇలాంటి అనేక కారణాలతోనే రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఈ కారణంగానే ఇపుడు ఆత్మకూరు ఉపఎన్నికలో పవన్, నాదెండ్లతో పాటు జనసేన నేతలెవరు తొంగి చూడలేదు. దీన్ని ఎలా సమర్ధించుకోవాలో అర్ధంకాక బీజేపీ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. జనసేన కేంద్రంగా ఈ మధ్య మొదలైన రాజకీయ పరిణామాలతో బీజేపీ నేతలు కూడా పవన్ అంటే బాగా మంటగా ఉన్నారు. పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాల్సిందే అని జనసేన నేతలు పెట్టిన ఒత్తిడిని కమలనాథులు గట్టిగానే ప్రతిఘటించారు. దాంతో మిత్రపక్షాల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది.