వీళ్ళకన్నా కేఏ పాలే బెటరా ?

తెలంగాణాలో ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలకన్నా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చాలా బెటరని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యల పై సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కాంత్ జైశ్వాల్ ను కలిసి వ్రాత మూలకంగా ఫిర్యాదుచేశారు. కేసీయార్, ఆయన కుటుంబసభ్యులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రు. 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు.

తన ఆరోపణలకు ఇవే ఆధారాలంటు కొన్ని డాక్యుమెంట్లను కూడా అందించారు. పాల్ చేసిన ఆరోపణలు నిజామా కాదా, ఆయన అందించిన డాక్యుమెంట్లలో వాస్తవం ఎంత ? అన్న విషయాలను పక్కన పెట్టేద్దాం. ఇలాంటి ఆరోపణలనే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలాకాలంగా చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే కేసీయార్ అవినీతిపై విచారణ జరిపించి వెంటనే జైలుకు పంపిస్తామంటు వందల సార్లు చెప్పుంటారు.

కాంగ్రెస్ పార్టీ ఇలా ఆరోపణలతో కాలం గడుపుతోందంటే అర్ధముంది. మరి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ నేతలు కేవలం ఆరోపణలతోనే కాలం ఎందుకు వెళ్ళదీస్తున్నట్లు ? నిజంగానే వాళ్ళదగ్గర కేసీయార్+ఆయన కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడుంటే, అందుకు ఆధారాలుండటమే నిజమైతే ఎందుకని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయలేదు. తమ దగ్గరున్న ఆధారాలన్నింటిని కేంద్రానికి అందించి సీబీఐ విచారణ మొదలుపెట్టించవచ్చు కదా.

విచారణలో ఆరోపణలన్నీ నిర్ధారణ అయితే వెంటనే అందరి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించే అవకాశం బీజేపీ నేతలకు పుష్కలంగా ఉంది. అలాంటి అవకాశాలుండీ కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతున్నారంటే అర్ధమేంటి ? కాంగ్రెస్, బీజేపీ నేతల వైఖరితో పోల్చుకుంటే కేఏ పాల్ గట్టోరనే అనుకోవాలి కదా. అవినీతికి పాల్పడుతున్నారని, ఆధారాలున్నాయని చెప్పి సీబీఐ డైరెక్టర్ ను కలిసి కొన్ని డాక్యుమెంట్లను కూడా అందించారు. విచారణ జరిగితే ఆరోపణలు, డాక్యుమెంట్లలో నిజాలెంత అనేది తేలుతుంది.