వచ్చే ఎన్నికల్లో ఫైట్ మామూలుగా ఉండదు అని తేలిపోయింది. రెండు పార్టీలూ కొట్టుకున్నా కొట్టుకుంటాయి. పరస్పర దాడులు చేసుకున్నా చేసుకుంటాయి. ఆ విధంగా ఆ రెండు పార్టీలూ ఉన్నాయి. ఓ విధంగా టీడీపీది ఇప్పుడు సాహసం. ఎందుకంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలన్నవి ఉన్నా కూడా ఆ పార్టీ వీలున్నంత మేరకు నిరసనలు చేసి, ప్రజా బలం కూడగట్టుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది. ఆ విధంగా టీడీపీకి ఇవాళ ప్రజా మద్దతు కూడా కాస్త పెరిగి నట్లే ఉంది.
ఇదే సమయంలో వైసీపీ అధికార దర్పంతో వ్యవహరిస్తోందని ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిని కూడా నిలువరించాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. ఇక్కడ పోలీసుల అతి కారణంగా ప్రభుత్వం నిందలు మోస్తుందా లేదా వ్యవస్థల్లో ఉన్న తప్పిదాలే టీడీపీ మైలేజీ పెంపుదలకు సహకరిస్తున్నాయా? ఆ రోజు జగన్ ను టీడీపీ అడ్డుకుని ఉంటే ? ఇదే ప్రశ్న పలు సార్లు వినిపిస్తోంది.
ఇక టీడీపీ మరిన్ని యాత్రలకు కూడా సిద్ధం అవుతోంది. 26 చోట్ల మినీ మహానాడులు నిర్వహించి, ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగించాలనే చూస్తోంది. ఒకవేళ లోకేశ్ కనుక పాదయాత్ర చేపడితే వైసీపీ అడ్డుకునేందుకు కొన్ని వ్యూహాలు సిద్ధం చేయవచ్చు అని సమాచారం. ఆ విధంగా జరిగితే ఆటోమెటిగ్గా టీడీపీ పొలిటికల్ మైలేజ్ పెరిగిపోవడం ఖాయం.
ఆ రోజు జగన్ నడిచిన దారుల్లో టీడీపీ నేతలు పసుపు నీళ్లు చల్లితేనే ఒక్కసారిగా జనాగ్రహం పెల్లుబుకింది అన్నది కూడా మరిచిపోకూడదు. కనుక ఇటువంటి శుద్ధి కార్యక్రమాలతో అప్పట్లో టీడీపీ నాయకులు కొందరు పరువు తీశారు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు లోకేశ్ పాదయాత్రను ఎక్కడికక్కడ అడ్డుకుంటే, పెద్దగా కష్టపడడం అన్నది లేకుండా టీడీపీ అధికారంలో రావడం ఖాయం అన్నది పరిశీలకుల మాట.
ఒకవేళ లోకేశ్ పాదయాత్ర సజావుగా సాగనిస్తే అప్పుడు వైసీపీ మరింత ఇరకాటంలో పడడం కూడా ఖాయం…ఇది కూడా పరిశీలకుల అభిప్రాయమే ! కనుక లోకేశ్ ఒకవేళ పాదయాత్ర చేస్తే తప్పకుండా వైసీపీ కూడా సమాంతరంగా మరో యాత్రకు సిద్ధం కావాల్సిందే ! అధికారంలో ఉన్న నేతలు సాధారణంగా పాదయాత్రలు చేసే అవకాశాలు తక్కువ కనుక వైసీపీ బాస్ జగన్ తెలివిగా ఆయన నడిచే దారుల్లో గడపగడపకూ మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని ఉద్ధృత రీతిలో చేపట్టవచ్చు.
ఆ విధంగా వైసీపీ కూడా తన గేమ్ ప్లాన్ ను మార్చవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు. ఇదే సమయంలో బాబు బస్సు యాత్ర చేసినా, అచ్చెన్న పేరిట బీసీ యాత్ర (బస్సు యాత్ర) ఆరంభం అయినా కూడా అవన్నీ ప్రజల్లో టీడీపీ పాతుకుపోయేందుకు కాస్తో కూస్తో సహకరించేవే అని సంబంధిత వర్గాల మాట.కనుక టీడీపీ సాహసం చేస్తే వైసీపీ వినోదం చూస్తుందా ? ఇదే ప్రశ్న రాజకీయ వర్గాలన్నింటినీ కదిలిస్తోంది.