షర్మిల ఎంపిక వ్యూహాత్మకమేనా ?

వైఎస్సార్టీపీ అద్యక్షురాలు చేసిన ప్రకటన వ్యూహాత్మకమేనా ? ఇపుడిదే చర్చ తెలంగాణా రాజకీయాల్లో మొదలైంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. షర్మిల ప్రకటనపై రాజకీయపార్టీల్లో చర్చలు మొదలైతే ఖమ్మం జిల్లాలో అయితే ఒక్కసారిగా వేడి రాజుకుంది. పాలేరు నుండి పోటీచేయాలన్న షర్మిల ప్రకటన వ్యూహాత్మకమనే చెప్పాలి.

ఎలాగంటే యావత్ తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో దివంగత సీఎం వైఎస్సార్ కు స్ట్రాంగ్ మద్దతుదారులు, అభిమానులున్న విషయం తెలిసిందే. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, గ్రేటర్ మున్సిపల్ ప్రాంతం, కరీంనగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలో చాలా ఎక్కువగానే ఉన్నారు. ఈ జిల్లాలన్నింటితో పోల్చితే ఖమ్మంలో ఇంకా ఎక్కువగా ఉన్నారు. దీనికి ఉదాహరణ ఏమిటంటే 2014లో వైఎస్ బొమ్మపెట్టుకుని ప్రచారం చేస్తేనే ఒక ఎంపీ, ముగ్గురు ఎంఎల్ఏలు వైసీపీ తరపున గెలిచారు.

2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన దృష్టిని పూర్తిగా ఏపీ రాజకీయాలమీదే పెట్టారు. ఖమ్మంలో అడిగారు కదాని ఖమ్మం ఎంపీతో పాటు మరో ముగ్గురికి అసెంబ్లీ టికెట్లిచ్చారు. ఒక్కసారి కూడా జిల్లాలో జగన్ ప్రచారం చేయలేదు. అయినా ఖమ్మం ఎంపీతో పాటు పినపాక, వైరా, అశ్వరావుపేట ఎంఎల్ఏలను పార్టీ గెలుచుకున్నది. ఈ విషయాలన్నింటినీ గమనించి, పాలేరులో పూర్తిగా సర్వే చేయించుకున్న తర్వాతే షర్మిల ఇక్కడినుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇపుడు జిల్లాలో జరుగుతున్న యాత్రకు కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు. పాలేరు నియోజకవర్గం ఎస్సీ కోటాలో ఉన్నా పెత్తనమంతా రెడ్లదే. ఓటర్లలో మెజారిటి ఎస్టీ, ఎస్సీలే. అలాంటిదిపుడు ఓపెన్ అయ్యింది. అందుకనే రెడ్లు పోటీపడుతున్నారు. రెడ్ల ఆధిపత్యంలో ఎస్టీ, ఎస్సీలు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాతే పాలేరులో పోటీకి షర్మిల రెడీ అయిపోయారు. వ్యూహాత్మకంగా ఎంపికచేసుకున్న పాలేరులో ఫలితం సంగతి వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా ఉంటుందనటంలో ఏమీ సందేహంలేదు.