జ‌డ్చ‌ర్ల అభ్య‌ర్థిని అమెరికాలో ఖ‌రారు చేసిన రేవంత్‌..!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోందా..? ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదికి పైగా స‌మ‌యం ఉండ‌గానే ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థిని ముందే ఖ‌రారు చేసుకుంటోందా..? ఈ దిశ‌గా పార్టీ చీఫ్ రేవంత్ బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను వెతికే ప‌నిలో ప‌డ్డారా..? అందులో భాగంగానే జ‌డ్చ‌ర్ల అభ్య‌ర్థిని ఫిక్స్ చేశారా..? అదీ రేవంత్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి.

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌టన చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అమెరికాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల్లో పాల్గొనేందుకు రేవంత్ పార్టీ మ‌రో ఎంపీ కోమ‌టి రెడ్డి, ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీతో క‌లిసి వెళ్లారు. రాష్ట్రంలో చింత‌న్ శిబిర్ తీర్మానాల స‌మావేశం, ర‌చ్చబండ కార్య‌క్ర‌మాలు న‌డుస్తూండ‌గానే వీరు దాదాపు ప‌దిహేను రోజుల పాటు అగ్ర దేశంలో ప‌ర్య‌టించారు.

ఎన్నారైల‌ను కాంగ్రెస్ ద‌రికి చేర్చేందుకు.. అక్క‌డి వ్య‌వ‌సాయ విధానాల‌ను ప‌రిశీలించేందుకు రేవంత్ త‌గిన స‌మ‌యం కేటాయించారు. అలాగే రాజ‌కీయ ప‌రంగా రెండు కీల‌క సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఒక‌టి జ‌డ్చ‌ర్ల అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌డం.. మ‌రొక‌టి బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు బండ్రు శోభారాణిని కాంగ్రెసులో చేర్చుకోవ‌డం. రెండో విష‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ మొద‌టి విష‌యంలోనే పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జరుగుతోంది.

అమెరికాలో ప‌ర్య‌ట‌న‌లో రేవంత్‌ ఖ‌రారు చేసిన జ‌డ్చ‌ర్ల అభ్య‌ర్థి ఎవ‌రో కాదు.. ఎంపీ కోమ‌టి రెడ్డి అనుచ‌రుడు అనిరుధ్ రెడ్డి. వీరితో పాటు అమెరికాకు వెళ్లిన అనిరుధ్ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు.. అక్క‌డి త‌న కార్య‌క్ర‌మాలు.. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను పార్టీ అగ్ర‌నేత‌ల‌కు వివ‌రించార‌ట‌. దీంతో ఆయ‌న చురుకుద‌నాన్ని గ‌మ‌నించిన రేవంత్‌, కోమ‌టి రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేసుకోవాల‌ని.. టికెట్ ఇప్పించే బాధ్య‌త మాదే అని హామీ ఇచ్చార‌ట‌.

అయితే.. ఈ సీటు కోస‌మే గంపెడాశ‌లు పెట్టుకున్న మ‌రో ఇద్ద‌రు నేత‌లు మాత్రం హ‌తాశుల‌య్యార‌ట‌. ఈ స్థానంపై క‌న్నేసిన ఇద్ద‌రూ రేవంత్ అనుచ‌రులు కావ‌డం గ‌మ‌నార్హం. రేవంత్ కుడిభుజంగా చెప్పుకుంటున్న మ‌ల్లు ర‌వి ఈ సారి ఎలాగైనా ఇక్క‌డి నుంచి గెల‌వాల‌ని చూస్తున్నారు. క్రితం ఎన్నిక‌ల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిన ఆయ‌న మ‌రోసారి పోటీకి ఆస‌క్తి చూపుతున్నారు.

ఈయ‌న‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్ కూడా కాంగ్రెసు నుంచి టికెట్ ఆశిస్తున్నారు. క్రితం ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి పోటీ చేసి ఓడిన ఆయ‌న ఈసారి లోక‌ల్ గానే పోటీ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. వీరిలా ప్ర‌య‌త్నాలు చేసుకుంటుండ‌గానే అనిరుధ్ రెడ్డిని ఖ‌రారు చేయ‌డంతో తీవ్రంగా నిరుత్సాహప‌డిపోయార‌ట‌. ఎన్నిక‌ల నాటికి ఆయ‌నే అభ్య‌ర్థిగా తేలుతారా.. లేదా స‌మీక‌ర‌ణాల్లో భాగంగా త‌మ‌కు అవ‌కాశం వ‌స్తుందా అనే ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!