కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం మీద ఆర్మీలో చేరాలని భావించే పలువురు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టటం.. తమ ఆందోళనలో భాగంగా భారీ హింసకు తెర తీయటం తెలిసిందే. పక్కా వ్యూహంతో.. వాట్సాప్ సాయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి జొరబడి.. కొన్ని గంటల పాటు వారు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇలా చేతల్లో తమ ఆరాచకాన్ని ప్రదర్శించిన వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా వారి నోటి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోలీసులు సైతం తడబడిన పరిస్థితి. వారి వాదనలో పాయింట్లు ఉండటంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆందోళన చేపట్టిన పలువురు ఆందోళకారుల్ని అడ్డుకున్న పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సదరు నిరసనకారుడు చెలరేగిపోతూ ప్రశ్నల మీద స్రశ్నల్ని సంధించారు. పోలీసులకు ఎదురైన ప్రశ్నలు చూస్తే..
- చావడానికి సిద్ధపడే వచ్చాం.. కేంద్రం మాకు స్పష్టమైన హామీయిచ్చే వరకు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం.
- మేము చేసిన ఆందోళనలో ఒక్క ప్రయాణికుడు కూడా గాయపడలేదు. కానీ పోలీసులు జరిపిన కాల్పుల్లో మా వాళ్లు చాలా మంది గాయపడ్డారు.
- మేం చేస్తున్న డిమాండ్లు మీ పరిధిలో లేవు (పోలీసుల్ని ఉద్దేశించి).. అలాంటపుడు మీతో చర్చలు జరిపి ప్రయోజనం ఏమిటి?
- శాంతియుతంగా ఆందోళన చేపట్టిన మాపై లాఠీఛార్జి చేసి, ఎందుకు కాల్పులు జరిపారు?
- మాకు ఉద్యోగాలు వస్తే మేము కూడా సైనికులమే, అలాంటి మాపై కాల్పులు జరుపుతారా?
- మమ్మల్ని (ఆందోళన చేస్తున్న అందరిని) ఏఆర్వో దగ్గరికి తీసుకెళ్లలేమని పోలీసులు చెబుతున్నారు.అలాంటప్పుడు ఏఆర్వోనే మా దగ్గరకు రావొచ్చు కదా?
- అగ్నిపథ్ పథకం దేశానికి సంబంధించిన అంశం.. కేంద్రం నుంచి ప్రకటన వస్తేనే ఆందోళన విరమిస్తాం.
- పోలీసులు అరెస్ట్ చేసిన యువకులను వెంటనే విడుదల చేయాలి. వాళ్ల ప్రాణాలకు ఏదైనా అయితే పోలీసులదే బాధ్యత.