ఓయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది?

బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి చిత్రాల్లో చిన్న పాపగా షామిలి చేసిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేశాయి. బాల నటిగా ఆమె ఏకంగా 70 సినిమాల్లో నటించడం విశేషం. దక్షిణాదిన దాదాపుగా అన్ని బాషల్లోనూ నటించింది షామిలి. బాల నటిగా కేరళ, కర్ణాటక స్టేట్ అవార్డ్స్ సైతం అందుకోవడం విశేషం.

ఆ తర్వాత కొన్నేళ్లు చదువు మీద దృష్టిపెట్టి సినిమాలకు దూరమైన ఈ అమ్మాయి.. ‘ఓయ్’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమాకు తన వల్లే మంచి హైప్ వచ్చింది. కానీ ‘ఓయ్’ అంచనాలను అందుకోలేకపోవడంతో షామిలి.. తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. కనుమరుగైపోయింది. ఇప్పుడు షామిలి ఏం చేస్తోందన్నది ఆసక్తికరం. ఒకప్పుడు సినీ ఆర్టిస్టుగా అలరించిన షామిలి.. ఇప్పుడు పెయింటింగ్ ఆర్టిస్టుగా మారడం విశేషం.

చిన్నతనంలో సినిమాల్లో నటిస్తూనే బొమ్మలు గీసేదాన్నని.. ఆ ఆసక్తితోనే ఇప్పుడు ఆర్టిస్టు అయ్యానని షామిలి వెల్లడించింది. తన ఈ అభిరుచి గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి ఆర్ట్ మీద ఆసక్తి ఉంది. సినిమాల్లో నటిస్తున్నపుడు ఖాళీ దొరికితే బొమ్మలు గీసేదాన్ని. ఆర్ట్ కోసం సినిమాలు కూడా వదులుకున్నా. మా ఇంట్లో ఆర్టిస్టులు ఎవ్వరూ లేకపోయినా.. నేను దాని ప్రేమలో పడిపోయా. సింగపూర్ 2 లో ఫిలిం ప్రొడక్షన్ డిప్లమా చేస్తున్నపుడు ఆర్ట్ వైపు మనసు మళ్లింది. పారిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నా’’ అని షామిలి తెలిపింది.

షామిలి చైనీస్ ఇంక్ పెయింటింగ్, ఇటలీలోని అకడమియా రియాచి ఇన్ ఫ్లోరెన్స్ నుంచి గ్లాస్ పెయింటింగ్, డిజిటల్ ఆర్ట్స్ వంటి నైపుణ్యాలు నేర్చుకుంది. ప్రముఖ ఆర్టిస్ట్ ఏవీ ఇలాంగో ఆమెకు మెంటార్ అట. ఫిగరేటివ్ పెయింటింగ్‌ షామిలి స్పెషాలిటీ. తాను వేసిన పెయింటింగ్స్‌తో షామలి ఎగ్జిబిషన్లు సైతం ఏర్పాటు చేయడం విశేషం. చెన్నై, బెంగళూరుతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఆమె తన ఆర్ట్ ఎగ్జిబిషన్లు పెట్టింది.