వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు శవం కోసం అల్లాడిపోతున్న పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి హీరో ఎలాంటి పరిష్కారం చూపించాడనేది ఎమోషనల్ టచ్ తో చూపిస్తారు దర్శకుడు జీతూ జోసెఫ్.

ఇంకో వైపు దీనితో సంబంధం లేకుండా హిందీ దృశ్యం 3 వేరే కథతో అజయ్ దేవగన్ పరుగులు పెట్టిస్తున్నాడని బాలీవుడ్ రిపోర్ట్. ఇది అక్టోబర్ లో వచ్చేస్తుంది. ఎటొచ్చి తెలుగులో దృశ్యం 3 ఇప్పట్లో మొదలయ్యే సూచనలు లేవు. ఆదర్శ కుటుంబం తర్వాత అనిల్ రావిపూడి సినిమాతో డిసెంబర్ దాకా వెంకటేష్ డేట్లు దొరికే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో దృశ్యం 3 తెలుగు వర్షన్ దాదాపు క్యాన్సిల్ అయినట్టేనని ఫిలిం నగర్ టాక్. ఎందుకంటే మోహన్ లాల్ దృశ్యం 3 ఎంతలేదన్నా థియేటర్ రిలీజ్ తర్వాత యాభై రోజుల లోపే ఓటిటిలో వచ్చేస్తుంది. మెయిన్ ట్విస్టులు అన్నీ బయట పడతాయి. డబ్బింగ్ చేసి ఓటిటిలో పెడితే మంచిదే.

లేదంటే మూవీ లవర్స్ సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తారు. కాబట్టి స్పాయిలర్స్ తో పంచాయితీ లేకుండా ఉండాలంటే ఇదే ఉత్తమం. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ ఇమేజ్, మార్కెట్ అమాంతం పెరిగిపోయాయి. దృశ్యం 3 లాంటివి అంత సులభంగా వర్కౌట్ కాకపోవచ్చు.

అధికారికంగా దృశ్యం 3 షెల్వ్ అయ్యిందా లేదా అనేది తెలియడానికి ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. నిజమైతే వెంకటేష్ తీసుకున్న నిర్ణయం మంచిదే అవుతుంది. అక్టోబర్ విడుదల టార్గెట్ చేసుకున్న ఆదర్శ కుటుంబంలో వెంకీ, త్రివిక్రమ్ చాలా బిజీగా ఉన్నారు. వేసవిలోగా షూట్ పూర్తి చేయాలని ట్రై చేస్తున్నారు.

తర్వాత అనిల్ రావిపూడికి బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 2027 సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ అయ్యింది కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ విషయంలో వెంకటేష్ క్లారిటీతో ఉన్నారు. ఈ లెక్కన దృశ్యం 3 మన దగ్గర సెట్స్ పైకి వెళ్లడం దాదాపు లేనట్టేనని వినికిడి.