ఏపీలో ఒకేసారి రెండు కీలక సమస్యలు రాష్ట్రంలో అలజడి రేపుతున్నాయి. ఈ రెండు కూడా సాధారణ ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు కావడం.. దీనిపై పెద్ద ఎత్తున ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు తాజాగా సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. అధికారులు కదలకపోతే.. తానే రంగంలోకి దిగాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.
ఏం జరిగింది?
1) ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో డయేరియా సంభవించింది. దీంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో గత నాలుగు రోజుల్లో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను ఇప్పటికే తీవ్రంగా తీసుకున్న ప్రభుత్వం శ్రీకాకుళం మునిసిపల్ కమిషనర్‌ను విధుల నుంచి తప్పించింది. హుటాహుటిన మంత్రుల బృందాన్ని కూడా అక్కడకు పంపించి.. రోగులను ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
2) తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వెలుగు చూసిన కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందారు. అనేక మందిలో కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా గుర్తించారు. ఈ ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. పాల తయారీ దారుల వివరాలను సేకరించడంతోపాటు.. నాణ్యత ప్రమాణాలను కూడా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు.. బాధిత కుటుంబాలకు.. 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా ప్రకటించింది.
సీఎం సీరియస్!
ఈ రెండు జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయా జిల్లాల అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. కానీ, వారు తూతూ మంత్రం అన్నట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
దీనిపై గురువారం రాత్రి సమీక్షించిన సీఎం.. సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. “మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారా? లేక నేనే రంగంలోకి దిగాలా?“ అని ప్రశ్నించారు. అధికారులు సరిగా స్పందించని పక్షంలో తానే స్వయంగా గ్రౌండ్ లెవిల్లో పర్యటించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates