కేసీయార్ తప్పు చేస్తున్నారా ?

ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో 22 పార్టీల కీలకమైన సమావేశానికి హాజరు కాకూడదని కేసీయార్ డిసైడ్ అయ్యారు. వచ్చే నెలలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్లబ్ లో నాన్ ఎన్డీయే పార్టీల అధినేతలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల అధినేతలకు కూడా మమత ఆహ్వానాలను పంపారు.

మమత నుండి ఆహ్వానాలను అందుకున్నవారిలో కేసీయార్ కూడా ఉన్నారు. కేసీయార్ ను సమావేశానికి ఆహ్వానిస్తూ స్వయంగా మమత ఫోన్ చేసి మాట్లాడారు. మమత ఇంతటి ప్రాధాన్యత ఇస్తే కేసీయార్ మాత్రం సమావేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదని డిసైడ్ అయ్యారు. తొందరలోనే టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ గా మార్చాలని కేసీయార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చాలని కేసీయార్ అందుకు అవసరమైన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు.

ఇలాంటి నేపథ్యంలో జరుగుతున్న కీలకమైన సమావేశానికి కేసీయార్ వెళ్ళుంటే బాగుండేది. తాను ఏర్పాటు చేయబోతున్న జాతీయ పార్టీ విషయాన్ని సమావేశానికి హాజరయ్యే నేతలతో చర్చించే అవకాశం, మద్దతు కోరే అవకాశం ఉండేది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు హాజరయ్యే సమావేశానికి తాను కూడా హాజరైతే జనాలకు రాంగ్ సిగ్నల్ వెళుతుందని కేసీయార్ అనుకున్నారు. అందుకనే కాంగ్రెస్ హాజరయ్యే సమావేశాలకు టీఆర్ఎస్ హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారట.

ఇక్కడే కేసీయార్ తప్పుచేస్తున్నారని అనిపిస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న కేసీయార్ కు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా మనుగడ సాగించలేదు. మహారాష్ట్రతో తెలంగాణాకు జల వివాదాలున్నాయి. కాబట్టి మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు పెద్దగా సానుకూలత ఉండదు. ఏపీలో కూడా పెద్దగా సానుకూలత ఉండదు. కర్నాటకలో కేసీయార్ కు మద్దతుగా నిలబడే పార్టీ ఏమిటో చూడాలి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలబడే పార్టీలే కనబడటం లేదు.

దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ లేదా బీజేపీలతోనే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పొత్తుల్లో ఉన్నాయి. ఏపీలో వైసీపీ, ఒడిస్సాలో బిజూ జనతాదళ్ లాంటివి మాత్రమే నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ అంటున్నాయి. మరీ పరిస్ధితుల్లో కేసీయార్ తో పొత్తు పెట్టుకునే పార్టీలేమిటనే విషయంలో ఆసక్తి పెరిగిపోతోంది.