నాడు నేడు : జ‌గ‌నన్న బ‌డిలో కొత్త గొడ‌వ

రేష‌నలైజేష‌న్ పేరిట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 18 వేల పోస్టుల‌కు పైగా తొల‌గిస్తుంద‌ని తెలుస్తోంది. రానున్న కాలానా నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ (ఎన్ఈపీ ) అప్లై చేయ‌నున్నందున ఈ చ‌ర్య‌లు తీసుకోనుంద‌ని తెలుస్తోంది. ఈ విధానంలో భాగంగా ఒక‌టి నుంచి ఎనిమిది త‌ర‌గ‌తుల‌కు ఇంగ్లీషు మీడియం మాత్ర‌మే ఉంచి, తొమ్మిది, ప‌ది త‌ర‌గ‌తుల‌కు ఇంగ్లీషు, తెలుగు మాధ్య‌మాల్లో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు మాధ్య‌మాల్లోనూ పాఠాలు బోధించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని, లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది ప‌డ‌తార‌ని ఓ వైపు ఉపాధ్యాయ సంఘాలతో పాటు త‌ల్లిదండ్రులు ప‌ట్టుప‌డుతుంటే ఇవేవీ వినిపించుకోకుండా ప్ర‌భుత్వం ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో కాలం వెచ్చిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వాస్త‌వానికి ఎక్క‌డ చూసినా స‌బ్జెక్ట్ టీచ‌ర్ల కొర‌తే ఉన్న‌ది. ప‌దిహేడు వంద‌ల‌కు పైగా పోస్టులు సబ్జెక్టు టీచ‌ర్ల‌వే భ‌ర్తీ చేయాల్సి ఉంది. మెగా డీఎస్సీ లేని కార‌ణంగా సిబ్బంది కొర‌త వేధిస్తోంది. మొన్న‌టి టెన్త్ ఫ‌లితాల్లో కూడా స‌బ్జెక్ట్ టీచ‌ర్లు లేని కార‌ణంగానే ఇబ్బందులు త‌లెత్తి ఫ‌లితాలు పూర్తిగా నిరాశాజ‌న‌కంగా ఉన్నాయి అని తేలింది. దీంతో పాటు ఉద్యోగ విరమ‌ణ, కోవిడ్ తో స‌హా ఇత‌ర మ‌ర‌ణాల త‌దిత‌ర కార‌ణాల రీత్యా వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భ‌ర్తీపై ప్ర‌భుత్వం దృష్టి సారించ‌కుండా, కేవ‌లం బ‌డుల‌కు హంగులు చేకూర్చాం అని చెప్ప‌డం అస్సలు భావ్యంగా లేద‌ని ఉపాధ్యాయ లోకం గ‌గ్గోలు పెడుతోంది.

ముఖ్యంగా లాంగ్వేజ్ టీచ‌ర్ల క‌న్నా స‌బ్జెక్ట్ టీచ‌ర్ల కొర‌త ఉండ‌డ‌మే కాకుండా ఉపాధ్యాయులకు ఈ ప్ర‌భుత్వం బోధ‌నేత‌ర ప‌నులు విప‌రీతంగా అప్ప‌గిస్తోంద‌ని కూడా తెలుస్తోంది. ఇది కూడా ఓ విధంగా నిరాశ‌జ‌న‌క ఫ‌లితాల‌కు కార‌ణం అయి ఉంది. ఇప్పుడు తాము ఉద్య‌మ బాట ప‌ట్ట‌కుంటే పోస్టుల భ‌ర్తీలో ఆల‌స్య అన్న‌ది కొన‌సాగుతూనే ఉంటుంద‌ని ఉపాధ్యాయ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.