గత 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి తర్వాత కాలంలో వైసీపీకి అనుబంధంగా కొనసాగుతామంటూ వలస వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వారి నియోజకవర్గాల్లో సెగ పెరిగింది. వారి పరిస్థితి ఉండలేక, వెళ్లలేక అన్నట్లుగా ఉంది. పార్టీ అధిష్ఠానం నుంచి మద్దతు లభిస్తుందనుకున్న వారికి ఆశాభంగం తప్పడం లేదు. ఈ నలుగురిలో ఒకరైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ పరిస్థితి అత్యంత గందరగోళంగా మారిందనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లో గణేష్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించాక ఆయనకు విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అధినాయకత్వం అప్పగించింది. అప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తనయుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో నలుగురు కార్పొరేటర్లను కూడా ఆయన గెలిపించుకున్నారు.
నామినేటెడ్ పదవి ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న పార్టీ అధినాయకత్వం ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పచెప్పడేమిటి’ అని శ్రీవాత్సవ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి, శ్రీవాత్సవలు ఎవరి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మరో పక్క పార్టీ నేత సుధాకర్‌ను బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నిమమించారు. విశాఖ దక్షిణలో కార్యకలాపాలు చేపట్టేందుకు వైసీపీ అధినాయకత్వ ప్రతినిధి ఒకరు ఆయనను ప్రోత్సహించా రు.
శ్రీవాత్సవ కొంత నిదానించడంతో నలుగురు కార్పొరేటర్లతో కలిసి సుధాకర్ కార్యకలాపాలు ముమ్మరం చేశారు. సహజంగా అసమ్మతి స్వరాలు వినపడడానికి అవకాశం ఏర్పడింది. వాసుపల్లిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెడుతున్నారు. అధినాయకత్వం నుంచి ఆయనకు మద్దతు కొరవడిందన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో వాసుపల్లి బాధ్యతల నుంచి వైదొలిగారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో భవిష్యత్తు ఏంటనేది గణేష్ వర్గీయుల్లో గందరగోళంగా మారిందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.