మొత్తం మీద ఇటు తెలుగుదేశం పార్టీయే కాదు మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాకులు గట్టిగానే తగిలాయి. టీడీపీ నేతల నుంచి షాకులు తగిలాయంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ మిత్రపక్షం బీజేపీ నుంచి ఇంతటి షాక్ తగలటమే ఆశ్చర్యంగా ఉంది. త్యాగాలు చేసేది లేదని, పల్లకి మోసేదిలేదని చెబుతూ వచ్చిన పవన్ హఠాత్తుగా మూడు ఆప్షన్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
మూడు ఆప్షన్లు ఇవ్వటంలో పవన్ ఉద్దేశ్యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించటం, ప్రకటించటమే. పవన్ కు బాగా తెలుసు టీడీపీ ఆ పని చేయదని. అయినా సరే గాల్లో బాణం వేశారంతే. అందరూ ఊహించినట్లే టీడీపీ నేతల నుండి పవన్ పై ఎదురుదాడులు మొదలయ్యాయి. చంద్రబాబునాయుడుకే పవన్ మూడు ఆప్షన్లు ఇవ్వటంపై తమ్ముళ్ళల్లో కొందరు రెచ్చిపోయి పవన్ను వాయించేశారు.
సరే ఈ విషయం టీడీపీ తరపున చాలామంది ఊహించిందే కాబట్టి ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇదే సమయంలో అలాంటి సంకేతాన్నే బీజేపీ నేతలకు కూడా పంపారు. ఆశ్చర్యకరంగా పవన్ ను సీఎం అభ్యర్ధిగా కమలనాథులు కూడా అంగీకరించలేదు. అంటే పవన్ ను సీఎం అభ్యర్థిగా ఇటు టీడీపీ అటు బీజేపీ కూడా అంగీకరించకపోవటం సంచలనంగా మారింది. మిత్రపక్షం నేతల నుండి ఇలాంటి తిరస్కారం ఎదురవుతుందని పవన్ ఊహించి ఉండరేమో.
పవన్ సీఎం అభ్యర్ధిగా టీడీపీ అంగీకరించలేదంటే అర్ధముంది. ఎలాగంటే జనసేనకన్నా టీడీపీ చాలా పెద్ద పార్టీ. మొన్నటి సాధారణ ఎన్నికల్లో టీడీపీకి 39 శాతం ఓట్లు వస్తే జనసేనకు వచ్చింది 5.6 శాతం ఓట్లు మాత్రమే. ఎక్కడైనా పెద్ద ఓటుబ్యాంకున్న పార్టీయే సీఎం కుర్చీ కోరుకోవటం సహజం. ఇదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది 0.56 శాతం ఓట్లు మాత్రమే. ఓట్లశాతాన్ని ప్రామాణికంగా తీసుకున్నపుడు ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ నేతలు కూడా పవన్ ను సీఎం అభ్యర్ధిగా అంగీకరించటంలేదు. మొత్తం మీద ఎగస్పార్టీతో పాటు మిత్రపక్షం కూడా పవన్ కు పెద్ద షాకే ఇచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates