ఈ ఎంఎల్ఏలు వైసీపీలో ఇమడలేకపోతున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖ దక్షిణి నియోజకవర్గం సమన్వయకర్తగా ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ రాజీనామా చేయటంతోనే అందరిలో చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే వాసుపల్లి వైసీపీ ఎంఎల్ఏ కాదు. 2019లో టీడీపీ తరపున గెలిచి తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు.

2019లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో నలుగురు చంద్రబాబునాయుడుతో పడక పార్టీకి దూరమైపోయారు. గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరి, చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్, గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ, వైజాగ్ దక్షిణ ఎంఎల్ఏ గణేష్ వివిధ కారణాలతో టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గరయ్యారు. అధికారపార్టీనుండి ఏవో ప్రయోజనాలు ఆశించి ఈ నలుగురు వైసీపీకి దగ్గరయ్యారు. అయితే అప్పటికే పై నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ నేతలతో ఈ ఎంఎల్ఏలకు పడటంలేదు.

సహజంగానే అధికారపార్టీలో నేతలు చాలా ఎక్కువమందున్నారు. పైగా పై నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎంఎల్ఏ అభ్యర్ధులే నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఉన్నారు. దాంతో వైసీపీలోని నేతలకు, వైసీపీకి దగ్గరైన ఎంఎల్ఏలకు పడటంలేదు. దాంతో ఈ నలుగురిలో కరణంకు తప్ప మిగిలిలిన ముగ్గురికి పార్టీ నేతల నుండి సెగలు ఎక్కువైపోతున్నాయి. ఈ సెగను తట్టుకోలేకే తాజాగా వాసుపల్లి నియోజకవర్గం సమన్వయకర్తగా రాజీనామా చేశారు. దక్షిణ నియోజకవర్గంలో గణేష్ ను సమన్వకర్తగా నియమించినా అప్పటికే సమన్వకర్త హోదాలో ద్రోణంరాజు సుధాకర్ కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇలాంటి అనేక పరిణామాల వల్ల పై నలుగురు ఎంఎల్ఏలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నలుగురిలో కరణం పరిస్ధితే కాస్త మెరుగ్గా ఉందని పార్టీ నేతల సమాచారం. వల్లభనేని పరిస్ధితి అయితే మరీ అన్యాయంగా ఉంది. నియోజకవర్గంలోని బలమైన దుట్టా రామచంద్రరావు వర్గం వంశీని గట్టిగా వ్యతిరేకిస్తోంది. చివరకు వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఎవరికిస్తారనే ఆసక్తి పెరిగిపోతోంది. తమకే టికెట్లిస్తారనే నమ్మకంతోనే పై నలుగురు ఎంఎల్ఏలు ఇంకా వైసీపీకి దగ్గరగానే ఉన్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.