వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుల్లో ఒకరు, ఇటీవలే మంత్రి పదవి చేపట్టిన అంబటి రాంబాబుకు వివాదాలు కొత్త కాదు. నోటి దురుసుకు మారుపేరైన ఆయన.. ఈ మధ్య కాలంలో బాగా నెగెటివిటీని పెంచుకున్నారు. మంత్రి పదవి చేపట్టాక.. గతంలో కొడాలి నాని పోషించిన పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. నానికి దీటుగా జగన్ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. తన నోటి దురుసును చూపిస్తున్నారాయన.
ఐతే కొన్ని సందర్భాల్లో రాంబాబు మాటలు శ్రుతి మించుతుండటంతో ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిపోతోంది. అంతకంతకూ ఆయనకు శత్రువులు పెరిగిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరినీ శత్రువులుగా మార్చుకున్నారు. బేసిగ్గా తారక్ అభిమానులు ఎక్కువగా టీడీపీ మద్దతుదారులుగానే ఉంటారు కాబట్టి.. రాంబాబు వారికి శత్రువే. ఐతే తటస్థంగా ఉండే తారక్ అభిమానులకు కూడా ఆయన ఇప్పుడు విలన్ అయిపోయారు.
దీనికి కారణం రాంబాబు నోటి దురుసే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని, ఆయన తనయుడిని లోకేష్‌ను విమర్శించే క్రమంలో ఆయన అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ పేరెత్తి వివాదం కొని తెచ్చుకున్నారు. లోకేష్ కాకపోతే టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ నడిపించవచ్చని, అయినా ఆ పార్టీ బాగుపడదని చెప్పే క్రమంలో ‘‘లోకేష్ కాకపోతే జూనియర్ ఎన్టీఆరో బోనియర్ ఎన్టీఆరో’’ అంటూ తారక్‌ను తేలిక చేసేలా మాట్లాడారు అంబటి రాంబాబు. ఈ కామెంట్ తారక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
సోమవారం సాయంత్రం నుంచి వాళ్లు రాంబాబును లక్ష్యంగా చేసుకున్నారు. రాంబాబు పేరు మీద లీక్ అయిన శృంగార సంభాషణల తాలూకు ఆడియోలు పెడుతూ.. ఆయన్ని బూతులు తిడుతూ.. ఆయన్ని ఎంత అన్‌పాపులర్ చేయాలో అంతా చేస్తూ పోస్టుల వర్షం కురిపిస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అంతే కాక రాంబాబు చేసిందానికి ఏపీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలంటూ #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టి ట్రెండ్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates