డౌన్ డౌన్ జ‌గ‌న్‌.. త‌ల‌ప‌ట్టుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి నిరసనల సెగ తగులుతూనే ఉంది. పలుచోట్ల జనం సమస్యలపై నేతలను నిలదీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా విజయరాంపురంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌.. సొంత పార్టీ కార్యక‌ర్తల నుంచే వ్యతిరేకత చవిచూడాల్సి వచ్చింది. మా కొద్దు ఈ ప్ర‌భుత్వం అంటూ ఇక్క‌డ నినాదాలు చేయ‌డంతో ఎమ్మెల్యే అక్క‌డ నుంచి వేగంగా వెళ్లిపోయారు. మ‌రో వైపు.. డౌన్‌.. డౌన్ .. జ‌గ‌న్ అని ఎమ్మెల్యేకారు వెనుక ప్ర‌జ‌లు ప‌రిగెట్ట‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

శ్రీకాకుళంలో..

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి హాజరయ్యే నాయకులకు.. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం విజయరాంపురంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే బహిష్కరించారు. కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కారుని అడ్డగించి నిలదీశారు. ఎన్నికల ముందు ఇళ్లు, తాగునీరు, రోడ్డు మరమ్మతులు, అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఏ ఒక్కటీ అమలు చేయలేదని గ్రామస్థులు ప్రశ్నించారు.

ప్రశ్నించిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఊరి బయట నిలువరించారు. వేరే వర్గంతో ఊర్లోకి వెళ్లగా.. పింఛన్లు, తాగునీరు, రోడ్డు మరమ్మతులు ఎప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యేని స్థానికులు ప్రశ్నించారు. తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఈ క్ర‌మంలోనే మా కొద్దు ఈ ప్ర‌బుత్వం అని నినాదాలు చేశారు.

ప‌శ్చిమ గోదావ‌రిలో..

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరు గ్రామంలో.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నేతలకు… ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తుంటే.. జనం తమ గోడు వెళ్లబోసుకున్నారు. వితంతు పింఛన్‌ ఏడాదిగా రావట్లేదంటూ ఓ మహిళ వాపోయింది. పంచాయతీ అధికారులు మంచినీటి కనెక్షన్ కావాలంటే 25 వేల రూపాయలు అడుగుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. తాగేందుకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని.. నాయకులు మారినా తమ పరిస్థితి మారలేదంటూ గ్రామస్థులు వాపోయారు. దీంతో ఆయ‌న వారికి స‌ర్ది చెప్ప‌లేక ప‌ర్య‌ట‌న‌ను మ‌ధ్య‌లోనే ఆపుకొన్నారు.

విశాఖ‌ప‌ట్నంలో..

మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావును అడుగడుగునా ప్రజలు నిలదీస్తున్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం చిన్నాపురంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజలు స్థానిక సమస్యలపై ప్రశ్నించారు. ఇంటి నిర్మాణం చేసి సంవత్సరమవుతున్నా ఇప్పటి వరకు బిల్లు రాలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో అక్కడున్న నాయకులు, అధికారులు కలుగజేసుకొని సర్ది చెప్పడానికి ప్రయత్నించడంతో ఆమె ఒకింత ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు చెప్పే నాయకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగామని.. ఎన్ని రోజులు పడుతుందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావును నిలదీసింది. దీంతో ఏం సమాధానం చెప్పలేక అక్కడి నుంచి ఆయ‌న‌ మెల్లగా వెళ్లిపోయారు.