జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు.. మొత్తంగా 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలోని చౌటుప్పల్ లో పర్యటిస్తున్న ఆయన ఇక్కడ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఇటీవల మృతిచెందిన జనసేన కార్యకర్తలు సైదులు, శ్రీనివాసరావు కుటుంబాలను పరామర్శించేందుకు… ఆయన నల్గొండ జిల్లాకు వెళ్లారు. ముందుగా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన సైదులు కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సేనాని… సైదులు భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.
చౌటుప్పల్ నుంచి లక్కారం వరకు పవన్ కల్యాణ్ ర్యాలీగా వెళ్లారు. జనసేనాని రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ పర్యటన దృష్ట్యా… జనసేనానికి పట్టణంలో జనసేన కార్యకర్తలు… పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీచేస్తామని పవన్ ప్రకటించారు. తెలంగాణలో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 5 వేలకుపైగా ఓట్లున్నాయని అన్నారు.. తెలంగాణలోనూ రాజకీయాలను జనసేన శాసిస్తుం దని చెప్పారు. ఇక్కడ కూడా తమ పార్టీ బలోపేతానికి పనిచేస్తామని వెల్లడించారు. ఏపీలో ఎన్నికల పొత్తుపై సమాధానం దాటవేసిన పవన్ కల్యాణ్.. శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించడానికి కోదాడకు బయలుదేరారు.
జనసేన కార్యకర్తలకు వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సైదులు, శ్రీనివాస్ కుటుంబాలకు జనసేన ఎప్పుడు అండగా నిలుస్తుందని పవన్ చెప్పారు. నాకు జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే అండనిచ్చింది మాత్రం తెలంగాణ అభిమానులేనని పవన్ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. “నేను తెలంగాణలో సామాజిక మార్పు కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోరుకుంటున్నా. ఆశయం కోసం నిలబడేవాడికి ఓటమి ఉండదు.” అని పవన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates