గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే.. బీసీ మంత్రులు బస్సు యాత్ర చేపడుతున్నారని టీడీపీ విమర్శించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా.. బీసీలంతా టీడీపీ పక్షానే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు “బాదుడే బాదుడు” స్పందనతో జగన్ బీసీ జపం అందుకున్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీ అమలు చేసిన ఎన్నో బీసీ సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసిందన్న బుద్ధా వెంకన్న.. వాటిని తిరిగి పునరుద్ధరించేలా జగన్ని ఒప్పించాకే ఆర్. కృష్ణయ్య రాజ్యసభ పదవి తీసుకుంటే మంచిదని హితవు పలికారు. జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా.. బీసీలంతా టీడీపీ పక్షానే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే టీడీపీ బీసీ నేతలంతా సమావేశమై జగన్ బీసీ వ్యతిరేక డ్రామాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
ఆర్.కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన విషయం మరిచారా? అని బుద్ధా ప్రశ్నించారు. ఆయనకు ఎన్నో అవకాశాలు కల్పించింది టీడీపీ కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. స్వయంగా చంద్రబాబు ప్రచారం చేసి.. గెలిపించిన విషయాన్ని కృష్ణయ్య మరిచిపోవడం.. దారుణమని దుయ్యబట్టారు.
ఏపీలో రోడ్లకు మరమత్తులు ఏవి అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుంటే రోడ్లు ఎలా వేస్తారని నిలదీశారు. రివర్స్ టెండర్‌తో పాలన అంతా రివర్స్ అంటూ విమర్శించారు. ఎన్‌డీబీ నుంచి తీసుకున్న రుణం ఏమైందని అడిగారు. పేరు గొప్ప… ఊరు దిబ్బలా జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెలికాప్టర్‌లో కాకుండా రోడ్లపై జగన్ రెడ్డి తిరగాలని హితవుపలికారు. రహదారులపై కేటాయించిన రూ.6400 కోట్లు ఎటు మళ్లించారో శ్వేత పత్రం విడుదల చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో చంద్రబాబునే ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని.. అందుకే చంద్రబాబు పర్యటనలకు ప్రజలు పోటెత్తుతున్నారని బుద్ధా వెంకన్న చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates