చీరాల సమస్య పరిష్కారమైనట్లేనా ?

ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీ పరంగా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం సమస్య పరిష్కారమైనట్లేనా ? క్షేత్రస్థాయిలో పరిస్ధితులను చూస్తుంటే తాజా డెవలప్మెంట్ అలాగే అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ తరపున కరణం బలరామ్ పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన పోటీలో కరణం గెలిచారు. ఎప్పుడైతే అఖండ మెజారిటితో వైసీపీ అధికారంలోకి వచ్చిందో కొద్దిరోజులకే కరణం వైసీపీ మద్దతుదారుడిగా మారారు.

అప్పటినుండి కరణం-ఆమంచి వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వివాదం పరిష్కారానికి ఆమంచిని జగన్మోహన్ రెడ్డి పర్చూరు నియోజకవర్గం ఇన్చార్జిగా వెళ్ళమని చెప్పారు. అయితే దీన్ని ప్రిస్టేజిగా తీసుకున్న ఆమంచి పర్చూరుకు వెళ్ళటానికి ఇష్టపడలేదు. దాంతో రెండువర్గాల మధ్య గొడవలు మరింతగా పెరిగిపోయాయి. చివరకు ఈ గొడవలు పార్టీని బాగా దెబ్బతీసే పరిస్థితికి చేరుకున్నట్లు జగన్ దృష్టికి వెళ్ళింది.

అందుకనే ఆమంచిని పిలిపించుకుని పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జిగా వెళ్ళాలని జగన్ గట్టిగా చెప్పినట్లు సమాచారం. అలాగే ఆమంచి అడిగిన కొన్ని విషయాలపైన కూడా జగన్ సానుకూలంగా స్పందించారట. దాంతో పర్చూరు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకుని పనిచేయటానికి ఆమంచి అంగీకరించారు. దాంతో ఇటు చీరాల అటు పర్చూరు ఇన్చార్జి సమస్యలు పరిష్కారమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో చీరాల టికెట్ కరణంకే ఇస్తారా ? లేదా ఆయన కొడుకు వెంకటేష్ కే ఇస్తారా లేదా మరో నేతకు కేటాయిస్తారా అన్నది తెలీదు.

ఇదే సమయంలో పర్చూరు టికెట్ ఆమంచికి కేటాయించబోతున్నట్లు హామీ వచ్చిందంటున్నారు. మరి ఇదే నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి కొడుకు మధుసూధనరెడ్డి పరిస్ధితి ఏమిటనే విషయం తేలాలి. మొత్తానికి చీరాల, పర్చూరులో పార్టీ ఇన్చార్జీల విషయంలో అయోమయమైతే క్లియర్ అయిపోయిందనే అనుకోవాలి. ఇప్పటినుండైనా ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీస్ ఊపందుకుంటాయా లేదా అన్నది ఆసక్తిగా మారింది.