మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత ఊళ్లోనే ఝలక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు వేల మంది కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరిపోయారు. ఈ అనూహ్య పరిణామంతో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. మంత్రి బొత్స పోకడలు నచ్చక వీరంతా పసుపు కండువాలు కప్పుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గత కొద్దికాలంగా చీపురుపల్లి నియోజకవర్గంలో సొంత మనుషులే మంత్రిని నమ్మడం లేదని కూడా తెలుస్తోంది. మంత్రికి ఇంటి పోరు కూడా విపరీతంగా ఉంది.
అటు రాష్ట్ర ప్రభుత్వంలో మరో సారి చోటు దక్కించుకున్నా ఆయన ఆశించిన రీతిలో పనిచేయ లేకపోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. పదో తరగతి పరీక్షలను సమర్థంగా నిర్వహించడంలో ఆయన తడబడ్డారన్న వాదనకు బలం చేకూరుస్తూ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా బొత్స ఇమేజ్ ను తగ్గించేవే ! నష్ట పరిచేవే !
ముఖ్యంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అస్సలు లేవు. ఇంకా చెప్పాలంటే చీపురుపల్లి బస్టాండ్ ఇవాళ్టికీ అధ్వాన స్థితిలోనే ఉంది. కొద్దిపాటి అభివృద్ధి పనులు మాత్రం విజయనగరంలో చేపట్టినా, ఆ పాటి కూడా ఇక్కడ చేయలేకపోయారు. దీంతో గ్రామాల్లో తిరుగాడేందుకు ఆయన పెద్దగా సాహసం చేయలేకపోతున్నారు. విజయనగరంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించినా వాటిలో ఇప్పటిదాకా బొత్స పాల్గొన్న దాఖలాలేవి పెద్దగా లేవు. ఒకవేళ ఆయన క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లినా, ఇంటింటి సర్వే నిర్వహించినా కూడా ఆశించిన ఫలితాలు అయితే రావు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ తరఫున కిమిడి నాగార్జున (మాజీ మంత్రి కిమిడి మృణాళిని) కొడుకు దూసుకుపోతున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను వివరించడంలో ముందుంటున్నారు. అదేవిధంగా బాదుడే బాదుడు పేరిట నిరసన కార్యక్రమాలతో పాటు నిన్నటి వేళ ఉత్తరాంధ్ర తెలుగు యువత సభను నిర్వహించి, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. ఇవన్నీ బొత్స ఎదుగుదలకు ప్రతిబంధకం కానున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates