రాజస్థాన్లోని ఉదయ్పుర్లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్`లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టించుకోని పాత నాయకులను ఇప్పుడు స్మరిస్తున్నారు. అదేసమయంలో మైనార్టీ వర్గాలపై అమిత ప్రేమను ఒలకబోస్తున్నారు. ఈ రెండు పరిణామాలు కూడా కాంగ్రెస్ వ్యవహారంపై చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అవసాన దశలో ఉన్నదనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్న తర్వాత.. మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందనే చింత ఎదురైంది.
ఈ నేపథ్యంలో పార్టీకి దశ, దిశ ఏర్పాటు చేసేందుకు పార్టీని ముందుకు నడిపించేందుకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్ శిబిర్‌ను ఏర్పాటు చేసి.. చర్చిస్తున్నారు. పలు తీర్మానాలు కూడా చేస్తున్నారు. అయితే.. ఈ శిబిరంలో నాడు రాజీవ్ హత్య అనంతరం.. పార్టీ తరఫున ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ప్రధాని పీవీ నరసింహారావు భారీ కటౌట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ శిబిరానికి హజరైన నాయకుల మధ్య చర్చకు దారితీసింది. ఎందుకంటే.. పీవీని కాంగ్రెస్ ఎప్పుడో వదులుకుందనే చర్చ ఉన్న విషయం తెలిసిందే. ఆయన వల్ల కాంగ్రెస్‌కు ప్రతిష్ట దిగజారిందని.. కాంగ్రెస్ అధిష్టానం దృఢంగా నిర్ణయించుకుంది.
అందుకే.. పీవీ ఢిల్లీలో చనిపోయినప్పుడు కూడా ఆయన పార్థివ దేహాన్ని పార్టీ ఆఫీస్‌లో ఉంచకుండానే హైదరాబాద్‌కు పంపేశా రు. తర్వాత.. ఆయన వర్ధంతులు, జయంతులకు కూడా నాయకులు ఎవరూ.. ముఖ్యంగా గాంధీల కుటుంబం ఎప్పుడూ.. ముందుకు రాలేదు. నివాళి కూడా అర్పించలేదు. ఇప్పుడు అనూహ్యంగా.. పీవీ పేరు జపించడం.. ఆయన కటౌట్లను కీలకమైన చింతన్ శిబిర్ వద్ద ఏర్పాటు చేయడం వంటివి చర్చకు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రాష్ట్రానికి చెందిన పీవీని విస్మరించి.. కాంగ్రెస్ ఎన్ని అడుగులు వేసినా.. ప్రయోజనం లేదని.. మేధావిని తప్పించి.. ఎన్ని మాటలు చెప్పినా.. ఉపయోగం లేదని.. ఇక్కడి నాయకులు చాటుమాటుగా చెబుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇప్పుడుపీవీ జపం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే.. కాంగ్రెస్ వదిలేసిన.. పీవీని.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ ఓన్ చేసుకుంది. పీవీ శత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీపీవీని కాంగ్రెస్ ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందనే వాదన తెరమీదికి వచ్చింది. ఇదిలావుంటే, మరోవైపు మైనార్టీ జపం కూడా చింతన్ శిబిర్‌లో జోరుగా వినిపించింది. దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేశంలో ఉన్న మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు పెంచారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తెరగాలి.
అని సోనియా గాంధీ చేసిన ప్రసంగంపై మైనార్టీ వర్గం చర్చిస్తుండడం గమనార్హం. మరి ఈ యుక్తులు ఏమేరకు కాంగ్రెస్‌కు కలిసి వస్తాయో చూడాలి.