వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా? రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టించేందు కు అవసరమైన నిధుల కోసం.. జగన్ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదా? ఇప్పటి వరకు జగన్‌కు కలిసి వచ్చిన కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం నామమాత్రంగా మారిపోయిందా? ఇదీ.. ఇప్పుడు తెరమీదికి వచ్చిన కీలక ప్రశ్నలు ఎందుకంటే.. కేంద్రం తాజాగా చేసిన హెచ్చరికలు.. అధికార పార్టీలో తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి.
రాష్ట్రంలో వచ్చే రెండు మాసాలు కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమ్మ ఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం ఇలా చాలా కార్యక్రమాలను జూన్-జూలై మాసాల్లోనే అమలు చేయాల్సి ఉంది. అయితే..వీటికి వేల కోట్ల రూపాయల నిధుల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో వస్తున్న ఆదాయం.. జీతాలు, పింఛన్లు, ఇతరత్రా ఖర్చులకు మాత్రమే సరిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం నుంచి మరికొంత అప్పు తెచ్చుకునేందుకు జగన్ సర్కారు ప్రయత్నించింది.
అయితే.. ఇప్పటి వరకు జగన్ సర్కారుకు సహకరిస్తూ.. వచ్చిన కేంద్రం తాజాగా చేస్తున్న అప్పులకు సంబంధించి మెలిక పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. కార్పొరేషన్ల ద్వారా చేసుకున్న అప్పులు.. ప్రభుత్వం సొంతగా సమకూర్చుకున్న అప్పులను కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ చేసిన అప్పులుగా నే పరిగణిస్తామని.. వాటిని కూడా వీటిలో కలిపి మొత్తం అప్పులు ఇప్పటి వరకు ఎంత చేసారో చెప్పాలని .. తాజాగా.. ప్రకటించింది. ఇది సహజంగానే.. జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారింది.
మరో రెండు సంవత్సరాల్లోనే ఎన్నికలు ఉండడం.. ఇప్పడు అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత వేగంగా క్యాలండర్ ప్రకారం అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఇబ్బందులు సృష్టించడం పట్ల వైసీపీలో చర్చ ప్రారంభమైంది. మరో ఏడాది పాటు ఎంత లేదన్నా.. నెట్టుకురావాల్సిన సమయంలో ఇప్పుడు కేంద్రం ఇలా చేస్తే.. ఎలా అని తలపట్టుకుంటున్నారు. దీనిపై మరోసారి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates