2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ-వైసీపీ అంతర్గత మిత్రులు అనే విమర్శలు ఇతర పార్టీల నుండి వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ లోపాయికారి ఒప్పందం లేదా మద్దతు వల్లే జగన్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. జీవీఎల్ నర్సింహారావు వంటి బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా వైసీపీకి అనుకూలంగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి వారు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా గత ప్రభుత్వంపై చేసిన విమర్శల ఘాటు కనిపించడం లేదనే వాదనలు ఉన్నాయి.
అయితే ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్, తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గత కొద్ది రోజులుగా వైసీపీపై బీజేపీ స్వరం మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఏపీలోని అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే అధికార పార్టీని నిలదీయాలి. ఆ దిశలో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
జగన్ పాలన అన్నింటా రివర్స్ మంత్ర అని, ఆయనకు శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన ఏడాది పాటు చేసిన ఏపీ ప్రభుత్వ పాపాలు మరిచిపోయినట్లు కాదని, మద్యపాన నిషేధం, పోలవరం టెండర్లు, తిరుమల భూములు, రాజధాని అమరావతి.. ఇలా ఏపీలో అంతా రివర్స్ పాలన సాగుతోందని రామ్ మాధవ్ దాదాపు రెండు వారాల క్రితం నిప్పులు చెరిగారు. అసలు వారానికోసారి కోర్టు తప్పుపడుతున్న ప్రభుత్వం ఇదేనేమో అని ఎద్దేవా చేశారు. ఈ ఏడాదిలో కోర్టు నుండి దాదాపు 60సార్లు మొట్టికాయలు తిన్నదన్నారు.
తాజాగా, కిషన్ రెడ్డి కూడా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం అసత్యాలతో గడుపుతోందని, అహంకారపూరిత, అభివృద్ధి నిరోధక పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని, అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని నిలదీశారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడ్డటం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల రాజ్యాంగబద్దంగా నిరసన తెలిపినా కేసు పెట్టడమేమిటన్నారు. జగన్ పాలన అంతా అరాచక, అవినీతి, దౌర్జన్య పాలన అన్నారు.