ఇప్పటిదాకా ఏం చేసినా కూడా చెల్లింది. ఇకపై చెల్లాలంటే హామీలు నెరవేరాలంటే మళ్లీ మళ్లీ అప్పులే చేయాలి. ఇప్పటిదాకా ఏం మాట్లాడినా చెల్లిపోయింది. ఎన్నికలు వస్తున్నాయి.. గడప గడపకూ వైసీపీ పోనుంది అప్పుడేం చేయాలి.. అప్పులే చేయాలి. అంటే రాష్ట్రానికి అంటూ స్థిర ఆదాయం తీసుకువచ్చే పనులన్నీ ఎప్పుడో వదిలేసి ఇలా అప్పులు చేయడం మంచిదేనా అని అంటున్నాయి విపక్ష నాయకవర్గాలు. ఇదే సమయంలో కొత్త అప్పులు పుడితే కాస్త ఈ నెల ఒడ్డెక్కిపోవచ్చు అన్నది ప్రభుత్వ భావన.
నో డౌట్ .. కరోనా కారణంగా మూడేళ్ల పాలనలో రెండేళ్లు తీవ్ర అవస్థలు పడ్డారు.. ఎవరు కాదన్నారు. ఆ సమయంలో ప్రజలకు చేయాల్సినంత చేశారు.. అది కూడా ఎవ్వరూ కాదనరు. తెలంగాణ కన్నా ఆంధ్రానే బెటర్ అన్నది కొన్ని విషయాల్లో సైతం రుజువుకు నోచుకుంది. కానీ ఇప్పుడు అవన్నీ గతం. కొన్ని ఆర్థిక సంబంధ హామీలు చేయలేం అని చెప్పి వాయిదా వేయవచ్చు. కానీ ఆర్థికంగా ఖజానాకు భారం అనిపించినా కూడా సంబంధిత పథకాల అమలు ఆపలేదు. నిరాటంకంగా సాగించారు. ఇదే ఈ వేళ పెను ఉత్పాతానికి కారణం.
ఇవాళ ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ వేలంలో ఏపీ పాల్గొననుంది. అంటే కొత్త అప్పు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది. రాష్ట్రానికి కొత్త అప్పు రావాలంటే ఇప్పటి అప్పులకు సంబంధించి వడ్డీ చెల్లింపులు సరిగా ఉండాలి. అవి ఉన్నా లేకపోయినా కేంద్రం దీవెనలు కావాలి. అప్పుల కోసమే బుగ్గన రాజేంద్ర అనే ఆర్థిక మంత్రి తో పాటు కొందరు సలహాదారులు కూడా ఢిల్లీ కేంద్రంగా కొంత లాబీయింగ్ నడిపారు అన్న వార్తలు కూడా వచ్చేయి. ఈ తరుణాన ఏపీకి ఇవాళ కొత్త అప్పు పుడితే ఈ నెల సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ముందుగానే రూపొందించిన క్యాలెండర్ అమలుకు నోచుకోవడం ఖాయం. అంటే ప్రభుత్వం దిగిపోయేలోగా 12 లక్షల కోట్ల రూపాయలకు పైగానే అప్పు మిగలడం ఖాయం. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో చెప్పారు రానున్న కాలంలో తాము 1.10 లక్షల కోట్ల అప్పు చేయనున్నామని.. అందుకే ఆ విధంగా ఆయన కార్యవర్గం అడుగులు వేస్తుంది అన్నది ఓ వాస్తవం. తిరుగులేని నిజం కూడా !