రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై విచారణను హైకోర్టే సూమోటోగా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై అత్యాచారాలు ఆగని పక్షంలో జనాల్లో భయం పెరిగిపోతుందన్నారు. అందుకనే అత్యాచార ఘటనలను కోర్టే విచారణకు స్వీకరిస్తే జనాల్లో కాస్త ధైర్యం వస్తుందన్నారు. ఈ పద్ధతిలో హైకోర్టు చొరవ చూపించి ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం ఆపలేకపోతోందన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ బిడ్డలు మృగాళ్ళ బారిన పడకుండా తల్లిదండ్రులే కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నట్లు పవన్ ఎద్దేవా చేశారు. అయితే అందరూ గమనించాల్సిన ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. ఇటీవల జరిగిన రేపులు… భర్తల ఎదుట చేసినవి, ఇంట్లోకి తలుపుకొట్టి దూరి చేసినవి ఉన్నాయి. అవన్నీ గ్యాంగ్ రేప్ లు. ఇటువంటి విషయంలో… కుటుంబం ఎలా తమవాళ్లను రక్షించుకోగలదు.
బాధ్యత గలిగిన పోలీసు అధికారులు, సిబ్బందే అత్యాచారాల కట్టడికి చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. రాష్ట్రంలో ప్రతిరోజు మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతుండటం పట్ల పవన్ ఆందోళన వ్యక్తంచేశారు. అభంశుభం తెలియని పసిపిల్లలు, గర్భిణులు, మానసిక పరిస్ధితి సరిగా లేని వాళ్ళపైన కూడా దాడులు, అత్యాచారాలు జరగటం బాధేస్తోందన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలని, ధైర్యంగా తిరిగే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధితుల వివరాలను గోప్యంగా ఉంచమని చట్టం చెబుతుంటే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటు పవన్ మండిపడ్డారు. బాధితుల తాలూకు కుటుంబసభ్యలకు పరిహారం ఇచ్చే విషయాన్ని ఫొటోలు తీసుకుని మీడియాకు రిలీజ్ చేసిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. తల్లిదండ్రుల పెంపకాన్ని మంత్రి తప్పుపట్టడంపైనా మండిపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates