టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కరుణ కోసం.. నేతలు తహతహలాడుతున్నారు. ఆయన తమను కరుణించాలని.. నేతలు దేవుళ్లను మొక్కుతున్నారు. దీనికి కారణం.. త్వరలోనే మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఉండడమే! ఈక్రమంలో కేసీఆర్ ఇప్పటికే మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. 2018 ఏప్రిల్ 3న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా పరిణామాల అనంతరం పార్టీ అధినేత కేసీఆర్.. ప్రకాశ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మరో రెండున్నరేళ్ల పదవీకాలానికి ముందే ఆయన గత డిసెంబరు 4న రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. తాజాగా ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఎన్నికయ్యే అభ్యర్థికి 2024 ఏప్రిల్ వరకు అంటే 23 నెలల పదవీకాలం మాత్రమే ఉంటుంది. మరోవైపు మరో ఇద్దరు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌ల పదవీకాలం వచ్చే నెల 22 వరకు ఉంది. ఈ గడువుకు 25 రోజుల ముందే అంటే నెలాఖరుకు ఈ రెండు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది.
ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేరు పరిశీలనలో ఉంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చురుకైన పాత్ర పోషించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో విస్తృత పరిచయాలు, ఎంపీగా అనుభవం ఉన్న ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు వీలుగా అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపే రాజ్యసభ ఉప ఎన్నిక జరిగే ఈ స్థానానికి పదవీకాలం ముగుస్తుంది. దీంతో వినోద్‌ను మళ్లీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇబ్బందులూ ఉండవు.
వినోద్‌ను రాష్ట్ర బాధ్యతల్లోనే కొనసాగించాలని అనుకుంటే ఆయనకు బదులు నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు పేరును పరిశీలించే వీలుంది. మరోవైపు మిగిలిన రెండు రాజ్యసభ స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే ఆశావహుల జాబితా భారీగా ఉంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి గత పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో నామా నాగేశ్వరరావును బరిలోకి దింపగా గెలిచారు. ప్రస్తుతం ఆయన లోక్‌సభాపక్ష నేతగా ఉన్నారు.
ఈక్రమంలో పొంగులేటికి రాజ్యసభ టికెట్ ఇచ్చే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇంకా మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎంపీలు సీతారాంనాయక్, బూర నర్సయ్య గౌడ్, టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరుల పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా ఇప్పుడు కేసీఆర్ కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates