తండ్రిలాగే కేటీఆర్ పిట్ట క‌బుర్లు.. ఏపీ మంత్రి కౌంట‌ర్‌

ఏపీలో పాల‌న స‌రిగాలేద‌ని.. రోడ్లు గుంత‌లు ప‌డ్డాయ‌ని, ప్ర‌మాదాల‌తో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌ని.. ఇక‌, తాగేందుకు కూడా అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నీళ్లులేవ‌ని.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు.. ఏపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ జోగి ర‌మేష్ షాకింగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేటీఆర్‌, కేసీఆర్‌ల‌పై ఆయ‌న దుమ్మెత్తి పోశారు. ఇద్ద‌రికీ మైండ్ చెడిపోయింద‌ని అన్నారు. వారు ఏం మాట్ల‌డుతున్నారో.. వారికే అర్ధం కావ‌డం లేద‌న్నారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌కు జోగి స‌వాల్ రువ్వారు.

“కేటీఆర్‌.. నీకు క‌ళ్లు ఉంటే..  విజ‌య‌వాడ‌కు రా! వ‌చ్చి ..ఇక్క‌డ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేస్తోందో చూడు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లోద్దు“ అని వ్యాఖ్యానించారు. విజ‌య‌వాడ‌కు రావాల‌ని.. కేటీఆర్‌కు స‌వాల్ రువ్వారు. ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను తెలంగాణ‌లో కూడా అమ‌లు చేయాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయ‌ని.. అందుకే త్వ‌ర‌లోనే రెండు రాష్ట్రాల‌నూ క‌లిపేయాల‌నే డిమాండ్లు వ‌చ్చినా.. మ‌ళ్లీ తెలంగాణ ఏపీ.. క‌లిసిపోయి.. ఉమ్మ‌డిరాష్ట్రం ఏర్ప‌డినా.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

“ఏపీ అబివృద్ధి చూసి ఓర్వ‌లేక తండ్రీ కొడుకులు..(కేసీఆర్‌-కేటీఆర్‌) వాగుతున్నారు. కేసీఆర్ పిట్ట‌క‌బుర్లు చెబుతున్నార‌ని.. అక్క‌డి వారేచెబుతున్నారు. ఇప్పుడు తండ్రి చాటు బిడ్డ‌గా.. కేటీఆర్ కూడా పిట్ట‌క‌బుర్లు చెబుతున్నారు. అస‌లు హైద‌రాబాద్ అబివృద్ధి చేసింది ఎవ‌రో ముందుకు  కేటీఆర్ తెలుసుకోవాలి. అసలు హైద‌రాబాద్‌కు ఒక సంస్కృతి, సంప్ర‌దాయాన్ని నేర్పింది ఎవ‌రో.. కేటీఆర్ తెలుసుకోవాలి“ అని జోగి కౌంట‌ర్ ఇచ్చారు.

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఏపీ ప్ర‌జ‌లే సంస్కృతి నేర్పార‌ని, ఏపీపాలకులే.. హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశార‌ని.. ఇప్పుడు ఆ బ్రాండ్‌ను తండ్రీ కొడుకులు ఎంజాయ్ చేస్తున్నార‌ని.. జోగి వ్యాఖ్యానించారు. ఏపీలో ఏ గ్రామంలో చూసినా.. అభివృద్ధి క‌నిపిస్తుంద‌ని.. జోగి అన్నారు. కేటీఆర్ ఇలానే మాట్లాడితే.. తాము కూడా మాట్లాడ‌గ‌ల‌మ‌న్నారు. మొత్తానికి ఏపీ-తెలంగాణల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి.