వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, క్షేత్రస్థాయి నాయకులకు సీఎం జగన్ బలమైన వార్నింగ్ ఇచ్చారు. అసమ్మతిని ఎట్టి పరిస్థితిలోనూ.. సహించేది లేదన్నారు. ఎవరైనా.. అలా చేయాలని సాహసం చేస్తే.. అన్ని రూపాల్లోనూ వారిని అణిచేస్తామని తీవ్రస్తాయిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే.. అలా .. వాగితే.. ఆయా గొంతలు విప్పినవారిని పార్టీ నుంచి గెంటేస్తామని.. వార్నింగ్ ఇచ్చారు.
పార్టీలో అసమ్మతి స్వరాలు, వర్గ విభేదాలను ఎట్టిపరిస్థితిలోనూ సహించేదిలేదన్నారు. పార్టీనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. విభేధాలు వీడి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మే 2 నుంచి ‘ఇంటింటికి వైకాపా’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్లతోనూ భేటీ అయిన జగన్ పలు అంశాలపై వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో అసమ్మతి స్వరాలు తగ్గించుకోవాలని సూచించారు. ఎన్నికలకు ముందు.. తాను చెప్పే చివరి మాట ఇదేనన్నారు. వర్గ విభేదాలను ఎట్టి పరిస్థితిలోనూ ప్రొత్సహించబోనన్నారు. అందరూ కలసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, ఇతర అంశాలపైనా జగన్ చర్చించారు. మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం చేశారు.
మే 2 నుంచి ‘ఇంటింటికి వైసీపీ’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఆషామాషీ కాదని.. నాయకుల తలరాతలు మారుస్తుందని.. వెల్లడించారు. పార్టీ ఆదేశాలు ధిక్కరించిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవని… అప్పుడు ఏడ్చి మొరపెట్టుకున్నా.. ఉపయోగం లేదని జగన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల సమయంలో కర్నూలులో మాజీ ఎమ్మెల్యే సునీల్ సంగతిని జగన్ గుర్తు చేశారు.
సంక్షేమకార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేసిన జగన్… మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించి భంగపడిన అసంతృప్త నేతలను… సముదాయించారు. విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎవరూ బహిరంగ విమర్శలు చేయొద్దన్న జగన్… ప్రజాప్రతినిధులు పని తీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తానని సమావేశంలో సీఎం చెప్పారు.