పీకేతో క‌లిసే పయనం.. కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌నాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. నాలుగు రోజుల వ్యవధిలో మూడు సార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. 2024 సార్వత్రిక ఎన్నికలు, త్వరలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కావాల్సిన వ్యూహాలను అందజేశారు. పీకే కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయం అవ‌డ‌మే ఓ ట్విస్టు అనుకుంటే గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చి, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అవ‌డమే కాకుండా శ‌నివారం రాత్రి ప్రగతి భవన్ లోనే విడిది చేశారు.

దీంతో తెలంగాణ‌లో పీకే – కేసీఆర్ దోస్తీ విష‌యంలో ఏం జ‌ర‌గ‌నుంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ఈ విష‌యంలో ఓ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరికకు సర్వం సిద్దం చేసుకున్న ప్రశాంత్ కిషోర్ హైద‌రాబాద్ టూర్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాశంగా మారింది.

వ్యూహకర్తగా కంటే కార్యకర్తగానే కాంగ్రెస్ కు పీకే సేవలు అందించబోతున్నట్లు ఏఐసీసీ వర్గాలు వ్యాఖ్యానాలు చేయడం, దేశానికే బ్రాండ్ లా మారిన పీకే కాంగ్రెస్ లోకి రావాలనుకోవడం శుభపరిణామమని సోనియా విధేయుడైన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ అనడం తదితర పరిణామాలు పీకే ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. కానీ ప్రశాంత్ కిషోర్ సైలెంటుగా కేసీఆర్‌తో స‌మావేశం అయ్యారు. దీనిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌యుడు, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తాను స్థాపించిన ఐ-ప్యాక్ సంస్థ‌తో పీకే సంబంధాలు తెంపుకొన్నార‌ని పేర్కొంటూ… త‌మ‌కు ప్ర‌శాంత్ కిషోర్ కాకుండా ఆయ‌న సంస్థ సేవ‌లు అందిస్తుంద‌ని వెల్ల‌డించారు.

కాగా, కాంగ్రెస్ లో చేరిక ప్రయత్నాలు ఆరంభించడం కంటే ముందే తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేయాలని పీకే నిర్ణయించుకున్న క్రమంలో.. ఒప్పందాల మేరకు తాను టీఆర్ఎస్ తోనే కలిసి పని చేస్తానని పీకే స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, త‌ను నేరుగా కాకుండా త‌న సంస్థ‌తో సేవ‌లు అందించేలా గులాబీ పార్టీ వ‌ర్గాల‌ను ఒప్పించిన‌ట్లు స‌మాచారం. కాగా, అటు ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరికకు ప్రయత్నిస్తూ, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యర్థి టీఆర్ఎస్ కు స్ట్రాటజిస్టుగా పీకే కొనసాగడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. మ‌రోవైపు రాజ‌కీయ వ‌ర్గాలు షాక్ అవుతున్నాయి.